అఫిలియేషన్లు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 460 ఇంజనీరింగ్ కాలేజీల్లోని 2,53,964 సీట్ల భర్తీకి అఫిలియేషన్లు లభిం చాయి. వాటిల్లో ప్రవేశాల కోసం ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ (వెబ్ ఆప్షన్లు) ప్రారంభం అవుతోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం గా 645 ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,62,985 సీట్లకు ప్రభుత్వ అనుమతి ఉన్నా.. సంబంధిత వర్సిటీల నుంచి 460 కాలేజీల్లోని 2,53,964 సీట్ల భర్తీకే అనుమతులు లభించాయి. విద్యార్థులు ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీల్లో ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. అవసరమైన ఏర్పాట్లను సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది. కళాశాలలు, సీట్ల వివరాలను http://eamcet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అయితే శనివారం రాత్రి 11 గంటల వరకు ఈ వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టలేదు.. రాత్రి 12 గంటల తరువాత వెబ్ ఆప్షన్లకు వీలు కల్పించాల్సి ఉన్నా సాధ్యం కాలేదు. దీంతో ఆదివారం ఉదయం నుంచి అభ్యర్థి లాగిన్ పేజీ ఓపెన్‌కు అవకాశం కల్పించనున్నారు.
భారీ సంఖ్యలో కాలేజీలు ఔట్..
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన అన్ని కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అఫిలియేషన్లు లభించలేదు. తనిఖీల్లో లోపాలు గుర్తించిన కాలేజీలకు అనుమతులివ్వలేదని అధికారులు వెల్లడించారు. దీంతో విద్యార్థులకు అందుబాటులో ఉండే కళాశాలల సంఖ్య ఈసారి భారీగా తగ్గింది. అఫిలియేషన్లు లభించని కాలేజీలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా 315 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,84,575 సీట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరిధి (తెలంగాణ)లో ఉండగా... ఇందులో కేవలం 141 కాలేజీల్లోని 85,455 సీట్లకు మాత్రమే అఫిలియేషన్లు లభించాయి. వీటితోపాటు 33 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 7,184 సీట్ల భర్తీకి అనుమతులు వచ్చాయి.
వీటినే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగతా 174 కళాశాలకు అఫిలియేషన్లు రాలేదు. వాటి పరిస్థితి ఏమిటనేదానిపై స్పష్టత లేదు. రెండో దశలో అనుమతులు ఇస్తారా? లేక ఈ సారికి అఫిలియేషన్లు లేనట్లేనా? అన్నదానిపైనా ప్రవేశాల క్యాంపు అధికారుల వద్ద సమాచారం లేదు. కాగా.. ఫార్మసీలో 61 కాలేజీల్లో 10,910 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీల్లో 600 సీట్ల భర్తీకి అఫిలియేషన్ లభించింది.
ఏపీలో 1,68,509 సీట్లు..
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 330 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా... వాటిలో 319 కాలేజీలకు అఫిలియేషన్లు లభించాయి. ఇంజనీరింగ్‌లో 1,78,410 సీట్లకు గాను 1,68,509 సీట్లను వెబ్ ఆప్షన్లకు అందుబాటులో ఉంచనున్నారు. 122 ఫార్మసీ కాలేజీల్లో 111 కాలేజీలకు అనుమతులు వచ్చాయి. వీటిల్లో 12,870 సీట్లకు గాను 10,510 సీట్లు అందుబాటులో ఉంటాయి.
కోర్టుకు వెళ్లనున్న యాజమాన్యాలు..
పెద్ద సంఖ్యలో కళాశాలలకు అఫిలియేషన్లు రాకపోవడంతో యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. మొదటి, రెండో తనిఖీల తరువాత లోపాలపై నివేదికలు ఇవ్వలేదని.. లోపాలపై సమాచారం ఇవ్వకుండానే అఫిలియేషన్లను నిరాకరించారని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. జేఎన్‌టీయూ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నాయి. దీనిపై కోర్టులో ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పాయి.
ఇదీ షెడ్యూలు..
ఆగస్టు 17, 18 తేదీల్లో: 1వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు
20, 21 తేదీల్లో: 50,001వ ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకు
22, 23 తేదీల్లో: 1,00,001వ ర్యాంకు నుంచి 1.50 లక్షల ర్యాంకు వరకు
24, 25 తేదీల్లో: 1,50,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు
26, 27 తేదీల్లో: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం
26న: 1వ ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకున్నవారు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు
27న: 1,00,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకున్న వారు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు.
30వ తేదీన: సీట్ల కేటాయింపు ప్రకటన
సెప్టెంబరు 1వ తేదీన: కళాశాలల్లో రిపోర్టు, తరగతులు ప్రారంభం
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
Published Sun, Aug 17 2014 2:00 AM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM
Advertisement