=రెవెన్యూ అధికారులకు అంగన్‌వాడీల ఝలక్
=80 పోలింగ్ బూత్‌లలో విధులకు గైర్హాజరు
=గౌరవ వేతనం ఎగనామం పెట్టడంపై నిరసన
=ఇక అదనపు బాధ్యతలొద్దని స్పష్టీకరణ
గుడివాడ, న్యూస్‌లైన్ : ఎన్నికల విధులు ఇకపై తాము చేయలేమని అంగన్‌వాడీ కార్యకర్తలు రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పారు. రెండున్నరేళ్లు గొడ్డుచాకిరీ చేస్తే రూ.200 చేతిలో పెట్టి.. మళ్లీ పనులు చేయించుకోవాలనుకున్న రెవెన్యూ అధికారులకు ఝలక్ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎన్నికల కమిషన్ విధులకు గుడివాడ పట్టణంలోని దాదాపు 80 పోలింగ్ కేంద్రాలు బీఎల్‌ఓలు హాజరుకాలేదు. రెండున్నరేళ్లుగా తమ పేరుతో వస్తున్న నిధుల్ని అధికారులు మింగేశారనే అనుమానాలు బీఎల్‌ఓలు వ్యక్తపరుస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియకు విఘాతం..
ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణల్లో భాగంగా గుడివాడ నియోజకవర్గంలోనూ అంగన్‌వాడీ కార్యకర్తలు, కార్మికులు పోలింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. నవంబర్ 24, డిసెంబర్ 1, 8 తేదీలలో బీఎల్‌ఓలు, వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్లు కలిసి ఓటర్ల నమోదు, సవరణలకు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంది.
ఆదివారం ఉదయం గుడివాడలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఉన్న బీఎల్‌ఓలు విధులకు గైర్హాజరయ్యారు. ఈ విషయం ఊహించని రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఉదయాన్నే ఎక్కడా బీఎల్‌ఓలు లేకపోవటంతో కారణాలు ఆరా తీశారు. అన్నిచోట్లా విధులను బహిష్కరించారని తెలుసుకుని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసే పనిలో పడ్డారు.
గొడ్డుచాకిరీ చేయించుకుని చిల్లర ఇస్తారా?
గౌరవ వేతనం ఇస్తామంటూ గత నెలలో గుడివాడ తహశీల్దారు కార్యాలయానికి అంగన్‌వాడీలను పిలిచిన అధికారులు ఎన్నికల విధులను వివరించినట్లు సమాచారం. అనంతరం గౌరవ వేతనం రూ.200 వచ్చిందని, తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిసింది. రెండున్నరేళ్లపాటు పనిచేయించుకుని రూ.200 చేతిలో పెట్టడంపై సమావేశానికి హాజరైన అంగన్‌వాడీ కార్యకర్తలంతా ఒక్కసారిగా మండిపడినట్లు సమాచారం. ఆ సొమ్ము తమకు అక్కర్లేదని అధికారుల ముఖానే పడేసి వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్నందుకు ఏడాదికి రూ.3 వేలు చొప్పున ఇస్తామని అధికారులు తెలిపారని, రెండున్నరేళ్లకు గాను ఆ మొత్తం రూ.7 వేల వరకు రావాల్సి ఉందని అంగన్‌వాడీల వాదన.
గొడ్డుచాకిరీ చేయించుకుని చిల్లర తమ ముఖాన కొట్టేందుకు ప్రయత్నించారని అంగన్‌వాడీలు ఆగ్రహించినట్లు తెలిసింది. ఎన్నికల విధులు నిర్వర్తించి నందుకు గాను ఏడాదికి రూ.3 వేలు ఇస్తామని ఇలా రూ.200 ఇస్తే కనీసం ఆటో చార్జీలు కూడా రావు కదా అని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము ఎన్నికల విధులు చేయబోమని ఖరాకండీగా చెప్పినట్లు సమాచారం. గతంలో పనిచేసిన ఆర్డీఓ సాలూరి వెంకటేశ్వరరావు ఉన్నంత వరకు తమకు గౌరవ వేతనం బాగానే అందిందని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు.
గొడ్డుచాకిరీ ఇక చేయలేం...
ఆదివారం బూత్‌లలో కూర్చో బెట్టినది మొదలుకుని ఎన్నికల ఓటర్ల జాబితా చేర్పులు, మార్పులు అయ్యేవరకు గొడ్డుచాకిరీ చేయాల్సి వస్తుందని అంగన్‌వాడీ కార్యకర్తలు అంటున్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వని పనులు ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని రకాల సర్వేలు ఉన్నా తమనే ఉపయోగించుకుంటున్నారని, ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే తమ విధుల కాలాన్ని పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై అంగన్‌వాడీ సెంటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరచి ఉంచాలని ఆదేశాలు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు సమయం కుదరదని చెబుతున్నారు. ఈ మేరకు తమ డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు ఈ నెల 25వ తేదీ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు అంగన్‌వాడీ యూనియన్ నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక తహశీల్దార్ తేళ్ల దేవదాసును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తమ వీఆర్వోలు వెళ్లి బతిమలాడినా ఎవరూ రాలేదని తెలిపారు. ఎన్నికల విధులకు అంగన్‌వాడీలు సహకరించటం లేదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల విధులకు రాం రాం...
Published Mon, Nov 25 2013 12:47 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement