ఉద్యోగుల్లో అదే అనుమానం! | Employees suspected of the same! | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల్లో అదే అనుమానం!

Published Mon, Jan 26 2015 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

ఉద్యోగుల్లో అదే అనుమానం!

ఉద్యోగుల్లో అదే అనుమానం!

  • పీఆర్సీ ఇవ్వకూడదనే చంద్రబాబు బీద అరుపులు
  • 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్
  • పీఆర్సీ సిఫారసు చేసింది 29 శాతమే
  • చంద్రబాబు గత చరిత్ర చూసి భయపడుతున్న ఉద్యోగులు
  • సాక్షి, హైదరాబాద్: జీతాలకే డబ్బుల్లేవంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీద అరుపులు అరవడం ఉద్యోగులను మోసం చేసే వ్యూహంలో భాగమనే అనుమానాలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్నాయి. ఫిట్‌మెంట్ విషయంలో ఉద్యోగులు చేస్తున్న డిమాండ్‌కు, పీఆర్సీ చేసిన సిఫారసుకు మధ్య చాలా వ్యత్యాసం ఉండటం, గతంలో చంద్రబాబు తీరు, తాజాగా ముఖ్యమంత్రి చెబుతున్న మాటలు.. వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వాస్తవంగా జీతాలకూ డబ్బుల్లేని పరిస్థితి లేకపోయినా, చంద్రబాబు బీద అరుపులు అరవడంలో ఆంతర్యం ఏమిటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

    ప్రభుత్వానికి పన్నుల రాబడి లేదా? ఇతర ఆదాయం ఎందుకు రావడం లేదు? ప్రస్తుత బడ్జెట్‌లో 10 నెలల కాలానికి పీఆర్సీ అమలుకు రూ.3,100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల సమస్యను తెరమీదకు తీసుకురావడం ఉద్యోగులను మోసం చేసే వ్యూహంలో భాగమేననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఫిట్‌మెంట్‌తో సరిపెట్టడానికి, 2013 జూలై నుంచి ఇవ్వాల్సిన కొత్త వేతనాల (ఆర్థిక లబ్ధి) బకాయిలకు ఎగనామం పెట్టడానికి ప్రభుత్వం ఆడుతున్న నాటకమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

    గతంలోనూ చంద్రబాబు ఇదే విధానం అవలంభించి పీఆర్సీల అమల్లో ఉద్యోగులకు అన్యాయం చేశారని గుర్తుచేస్తున్నారు. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరువు భృతి (డీఆర్) ఇవ్వకుండా వేదనకు గురిచేసిన చరిత్ర కూడా ఆయనకు ఉందని గతాన్ని గుర్తుచేసుకుని ఉలిక్కిపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా ఆర్థిక భారం లేని పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పీఆర్సీ ఇస్తానంటూ ఇచ్చిన హామీని పక్కనబెట్టడం ఉద్యోగుల అనుమాలకు మరింత బలం చేకూరుస్తోంది.

    తక్కువ ఫిట్‌మెంట్ ఇస్తారని అనుమానం

    పదో వేతన సవరణ సంఘం 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది. 69 శాతం ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తొమ్మిదో పీఆర్సీలో 27 శాతం ఫిట్‌మెంట్ అధారంగా వేతన సవరణ సంఘం కనీస వేతనాన్ని రూ.6,700గా నిర్ణయించింది. అయితే అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఫిట్‌మెంట్ 39 శాతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కనీస వేతనాన్ని కూడా 39 శాతం ఫిట్‌మెంట్‌కు అనగుణంగా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా, అప్పటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

    అందుకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.7,100గా నిర్ణయించి అమలు చేసింది. కానీ పదో పీఆర్సీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. పీఆర్సీ నివేదికలోని రూ.6,700నే కనీస వేతనంగా తీసుకుని ఇప్పుడు రూ.13 వేలను కనీస వేతనంగా నిర్ణయించింది. అయితే ప్రభుత్వం అమలు చేసిన రూ.7,100ను ఆధారంగా తీసుకుంటే.. పీఆర్సీ లెక్కల ప్రకారమే కనీస వేతనం దాదాపు రూ.14 వేలు అవుతుంది. కనీస వేతనం రూ.14 వేల నుంచి ప్రారంభమైతే.. మాస్టర్ స్కేల్‌లోనూ ఆమేరకు పెరుగుదల ఉంటుంది. దానిమీద ప్రభుత్వం నిర్ణయించే ఫిట్‌మెంట్‌ను లెక్కగడితే.. ఉద్యోగులకు కాస్త ఊరట లభిస్తుంది. కానీ ప్రభుత్వ వ్యూహం చూస్తుంటే.. కనీస వేతనాన్ని మార్చకుండా, తక్కువ ఫిట్‌మెంట్‌తో సరిపెడుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
     
     ఎగనామం పెట్టడానికే
     2013 జూలై నుంచి ఇవ్వాల్సిన ఆర్థిక లబ్ధి ఇవ్వకుండా ఎగనామం పెట్టడానికే ప్రభుత్వం నిధుల సమస్య అని ప్రచారం చేస్తుందేమోనన్న అనుమానముంది.  
     -ఐ.వెంకటేశ్వరరావు, ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్, యూటీఎఫ్ అధ్యక్షుడు
     
     ఎట్టిపరిస్థితుల్లో రాజీపడం
     ఏడాదిలో రావాల్సిన వసూళ్లు ఆరునెలల్లోనే వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఉద్యోగుల శ్రేయస్సు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.
     - బొప్పరాజు వెంకటేశ్వర్లు, జేఏసీ కో చైర్మన్, రెవెన్యూ సంఘం అధ్యక్షుడు

     ఉద్యమానికీ వెనకాడం
     అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేసే ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి ఇవ్వాల్సిందే. అన్యాయం చేయాలని చూస్తే.. ఉద్యమానికీ వెనకాడం.
     - కత్తి నరసింహారెడ్డి, జేఏసీ కో చైర్మన్, ఎస్టీయూ అధ్యక్షుడు

     ఫ్రెండ్లీ అంటూ జాప్యమా?
     ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకొంటూ.. పీఆర్సీ అమలును జాప్యం చేయడం సరికాదు.    
    - కమలాకరరావు, జేఏసీ కో చైర్మన్, పీఆర్టీయూ అధ్యక్షుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement