ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :
ఆదిలాబాద్ జిల్లాకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును ప్రశంసిస్తూ జిల్లాను జాతీయ అవార్డుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం ఆ శాఖ సంయుక్త కార్యదర్శి అపరజిత సారంగి ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో తొమ్మిది జిల్లాలకు అవార్డు ప్రదానం చేస్తుండగా ఇందులో జిల్లా కూడా ఉంది. ఏటా ఫిబ్రవరి 2న ఉపాధి హామీ దివస్ సందర్భంగా ఢిల్లీలో ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతీయ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డును కలెక్టర్ అహ్మద్‌బాబు, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి అందుకోనున్నారు. దీనితోపాటు మరో పదకొండు గ్రామపంచాయతీలకు ఉత్తమ నిర్వహణ కింద కూడా అవార్డును ఇదే వేదిక ద్వారా అందజేయనున్నారు.
అట్టడుగు నుంచి పైకి..
జిల్లాలో ఉపాధి హామీ పథకం ఫిబ్రవరి 2006 నుంచి ప్రారంభం కాగా ఇప్పటివరకు జాతీయ అవార్డు లభించలేదు. ప్రధానంగా కలెక్టర్ అహ్మద్‌బాబు సౌజన్యం, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు కారణంగా జిల్లాకు అవార్డు దక్కిందని ఆ శాఖలో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో రాష్ట్రంలో 22వ స్థానంలో ఉన్న జిల్లా ఇప్పుడు రెండో స్థానానికి చేరుకోవడమే దీనికి నిదర్శనం. ఉపాధి హామీ పథకం పరంగా గ్రామీణాభివృద్ధి శాఖ 26 రకాల ప్రాజెక్టు పనులు రూపొందించి క్షేత్రస్థాయిలో అమలుకు ఆదేశించగా, ఏ జిల్లాలో లేనివిధంగా మన జిల్లాలో 13 ప్రాజెక్టు పనులు నిర్వహిస్తుండటాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. భూమి అభివృద్ధి, ఉద్యానవన, ఇందిరమ్మ పచ్చతోరణం పథకాల పరంగా జిల్లా రాష్ట్రంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.
వాటర్‌షెడ్ పథకాల పరంగా రెండో స్థానంలో, ఇందిరా జలప్రభ పరంగా మొదటిస్థానంలో ఉంది. దీంతోపాటు నాడర్‌కంపోస్ట్, పశువుల తొట్టెలతోపాటు వివిధ పనులు విస్తృతంగా చేపట్టడం జరిగింది. భూ అభివృద్ధి పథకంలో అనేక పనులు చేపట్టడం ద్వారా జిల్లాలోని కూలీలకు పని కల్పించడంతోపాటు నిధుల వినియోగం జరిగింది. మొదట్లో జాతీయ అవార్డు కోసం దేశంలోని 40 జిల్లాల నుంచి నామినేషన్లు రాగా రాష్ట్రం నుంచి శ్రీకాకుళం, ఆదిలాబాద్, చిత్తూరు జిల్లాలు అందులో ఉన్నాయి. నెలరోజుల కిందట సదరు నామినేషన్ల ఆధారంగా కేంద్ర పరిశీలకులు ఆయా జిల్లాల్లో పథకం అమలుతీరును పరిశీలించి అందులోంచి 20 జిల్లాలకు కుదించారు. వీటిలో ఆదిలాబాద్, శ్రీకాకుళం జిల్లాలు ఉండగా ఈనెల 15న కేంద్ర పరిశీలకులు జిల్లాలో పర్యటించి ప్రత్యక్షంగా పథకం అమలుతీరును చూశారు. దీని ఆధారంగా కేంద్రానికి నివేదిక పంపారు. శ్రీకాకుళంతోపాటు ఆదిలాబాద్ జిల్లా జాతీయ అవార్డుకు ఎం పికైంది. శ్రీకాకుళం జిల్లాకు ఎక్కువ మంది కూలీలకు ఉపాధిహామీ కల్పించినందుకు అవార్డు లభించింది.
జిల్లా పరిస్థితి..
జిల్లాలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 5,32,894 జాబ్‌కార్డులు జారీ చేశారు. జాబ్‌కార్డుల్లో వ్యక్తిగతంగా 11,94,735 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 31,050 జాబ్‌కార్డులు జారీ చేయగా అందులో 59,662 జాబ్‌కార్డులు ఉన్నాయి. 2,73,845 కుటుంబాలకు కూలీ వేతనాలు ఉపాధిహామీ ద్వారా అందించగా, వ్యక్తిగతంగా 5,32,296 మంది ప్రయోజనం పొందారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.273 కోట్లతో పనులు చేపట్టారు. 35,847 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. జిల్లాలో డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు పీడీగా గణేష్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. మరో అదనపు పీడీ పోస్టు ఖాళీగా ఉంది. 52 మండలాలకు గాను ప్రతీ ఐదు మండలాలకు ఒక క్లస్టర్‌గా రూపొందించి ఒక్కో క్లస్టర్‌కు సహాయ పథక సంచాలకుల పది పోస్టులకు తొమ్మిది ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ పథకం అమలుపరంగా ఈయేడాది అధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు కారణంగా జిల్లాకు గుర్తింపు లభించింది.
ప్రధానంగా ఇటీవల జిల్లాకు వచ్చిన జాతీయ పరిశీలకులు ఉపాధిహామీ పరంగా నిధుల వినియోగం, చేపట్టిన పనులు, అధికారుల పర్యవేక్షణ అంశాలను తీసుకున్నారు. అందులో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనులకు సంబంధించి సమాచార బోర్డులు ఏర్పాటు చేయడం, అప్‌డేట్ చేయడం వంటి అంశాలు వారిని ఆకట్టుకున్నాయి. ఈజీఎస్ డెరైక్టర్ కరుణ సమాచార బోర్డుల ఏర్పాటులో జిల్లా తీరును ప్రశంసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లాను మోడల్‌గా తీసుకోవాలని ఆదేశించడం ప్రత్యేకం. ఇలా అనేక అంశాల్లో ఉపాధిహామీ పరంగా జిల్లాకు జాతీయ అవార్డు లభించింది.
‘ఉపాధి’ భేష్
Published Tue, Jan 28 2014 2:24 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement
Advertisement