క్రోసూరు/ అచ్చంపేట : వర్షాలు కురవాలని అంకమ్మ తల్లికి జలాభిషేకం నిమిత్తం కృష్ణానదిలో దిగి ప్రమాదవశాత్తూ ఓ విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన అచ్చంపేట మండలం చామర్రు రేవు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించి నదికి వెళ్లిన భక్తులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం క్రోసూరు కొండకింద బజారులో కొలువైవున్న అంకమ్మ తల్లికి వర్షాలు కురువాలని ఏటా జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అచ్చంపేట మండలం చామర్రు రేవు వద్ద కృష్ణా నది నుంచి నీళ్లు తెచ్చేందుకు ఆదివారం వేకువజామున రెండు ట్రాక్టర్లలో భక్తులు తరలివెళ్లారు. వీరిలో క్రోసూరుకు చెందిన వ్యవసాయ కూలీ గోగిశెట్టి రవి, ఆయన కుమారుడు అశోక్(17) కూడా ఉన్నారు. కొంతమంది బృందంగా ఏర్పడి తగు జాగ్రత్తలు తీసుకుని మిగిలినవారు బిందెలతో నీళ్లు తెచ్చేందుకు నదిలోకి దిగారు.
నదిలోకి దిగిన చీరాల రామారావు అనే యువకుడు కొద్దిగా ముందుకుపోయినట్లు గుర్తించి, ఆయన్ను హెచ్చరిస్తూ అశోక్ ముందుకుపోయాడు. అక్కడ నీటి సుడులు ఉన్నాయి. ఇంతలో రాచమంటి నరసింహారావు.. రామారావును ప్రమా దం నుంచి రక్షించగా.. అశోక్ నీటిలో మునిగిపోయాడు. వెంట నే జాలర్లు పడవల్లో గాలింపుచర్యలు చేపట్టి రెండు గంటల తర్వాత అశోక్ మృతదేహాన్ని వెలికితీశారు. అశోక్ సత్తెనపల్లిలోని వాసవి జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియెట్ ద్వితీ య సంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం సెలవుకావడం తో అశోక్ కూడా రేవుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతిచెందడంతో విషాదం అలుముకుంది. వ్యవసాయ కూలి పనులు చేసుకునే రవి, ఉషారాణి దంపతుల ఇద్దరు కుమారుల్లో అశోక్ పెద్దకుమారుడు. పెద్దోడు ప్రయోజకుడైతే తమ కష్టాలు తీరతాయనుకున్నామని ఇంతలోనే కానరానిలోకాలకు వెళ్లిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. అచ్చంపేట పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కృష్ణా నదిలో మునిగి విద్యార్థి మృత్యువాత
Published Mon, Aug 11 2014 12:45 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement