నగరపాలక సంస్థలో అకౌంట్స్, ఇంజినీరింగ్ విభాగాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది.
రూల్స్ తెస్తున్న తంటా విచారణ చేపట్టిన కమిషనర్
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అకౌంట్స్, ఇంజినీరింగ్ విభాగాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. అడ్డగోలుగా బిల్లులు చేయడం సాధ్యం కాదని ఫైనాన్షియల్ కమ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలీషా కొర్రీల మంత్రదండం ఉపయోగిస్తున్నారు. ఇలా అయితే కాంట్రాక్టర్లతో పనులు చేయించలేమని ఇంజినీరింగ్ అధికారులు తిరగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ సమావేశం మందిరం వద్ద ఈఈ ధనుంజయ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలీషాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు అధికారుల బహిరంగంగా వాదులాటకు దిగడంతో విషయం కమిషనర్ దృష్టికి వెళ్లింది. అసలు ఏం జరుగుతోందనే దానిపై కమిషనర్ విచారణ చేపట్టారు. అకౌంట్స్ ఎగ్జామినర్ ఎంవీ ప్రసాద్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రూల్స్ రగడ
ఫైనాన్షియల్ కమ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలీషా నెలరోజుల క్రితమే బాధ్యతలు చేపట్టారు. ఆడిట్ విభాగం నుంచి ఇక్కడకు వచ్చిన ఆయన రూల్ పొజిషన్ ఫాలో అవ్వాల్సిందేనంటున్నారు. ఈమేరకు 17 అంశాలతో కూడిన లేఖను చీఫ్ ఇంజినీర్‌కు అందించారు. నిబంధనల ప్రకారమైతేనే బిల్లులు చేస్తానని స్పష్టం చేశారు. జీవో 250 ప్రకారం నామినేషన్ వర్కులకు కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా ఉండాలనే ఆంక్ష విధించారు. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇచ్చేయండి కొత్తగా చేపట్టబోయే వాటికి సంబంధించి నిబంధనలు అమలు చేయాలనేది ఇంజినీరింగ్ అధికారుల వాదన. సబ్జెక్ట్, కండీషన్ కార్పొరేషన్లో ఫాలో అవ్వడం లేదని, భవిష్యత్‌లో దీనివల్ల ఆడిట్‌లో ఇబ్బందులు ఎదురవుతాయన్నది చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అభిప్రాయం. ఇంజినీరింగ్ అధికారులే కొందరు కాంట్రాక్టర్లను తనపైకి గొడవకు ఉసిగొలిపి అనవసర రాద్ధాంతం చేస్తున్నారనే భావనలో ఆయన ఉన్నారు.
అంతా చిక్కే
అకౌంట్స్ సెక్షన్లో ఉద్యోగం అంటేనే కత్తిమీద సాములా తయారైందని అధికారులు అంటున్నారు. ఇన్‌కం ట్యాక్స్ అప్‌డేట్ కాకపోవడం వల్లే తరుచు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కాంట్రాక్టర్లకు సంబంధించి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి ఏడాది సక్రమంగా ఫైల్ చేయలేకపోతున్నారు. ట్యాక్స్ కన్సల్టెంట్ పనితీరుపై విమర్శలు ఉన్నప్పటికీ రాజకీయ అండదండల కారణంగా ఆమెనే కొనసాగిస్తున్నారు.
అభివృద్ధిపై ఎఫెక్ట్
చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడిచినప్పటికీ ఎలీషాకు చాంబర్ కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన అకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ చాంబర్‌నే వాడుకుంటున్నారు. చాంబర్ ఏర్పాటుకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు వివరాలు తీసుకెళ్లి ఇరవై రోజులైనా ఇంత వరకు ఏర్పాటు చేయకపోవడం పట్ల ఎలీషా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అకౌంట్స్, ఇంజినీరింగ్ సెక్షన్ల మధ్య తలెత్తిన కీచులాట అభివృద్ధి పనులపై ప్రభావం చూపనుంది. వివాదం ముదిరిపాకాన పడకుండా సర్దుబాటు చేయాలనే యోచనలో కమిషనర్ ఉన్నట్లు సమాచారం.