
సాయానికి సంకెళ్లు!
గరుగుబిల్లి మండలం గొట్టివలసకు చెందిన లక్ష్మునాయుడు బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకుని తనకున్న రెండెకరాలు
ఆదుకోని సర్కారు.. ఆసరాకోసం బేజారు
రుణాలివ్వని బ్యాంకులు... ప్రైవేటు వ్యాపారులకు బేడీలు
జిల్లాలో కలకలం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారం
సామాన్యుడి అవసరాలు తీరడం ప్రశ్నార్థకమే!
రుణమాఫీ వివరాలు
రుణాలు తీసుకున్న రైతులు: 4.29 లక్షలు
తీసుకున్న రుణం : రూ. 1462 కోట్లు
మూడు విడతల్లో మాఫీ పొందిన రైతులు: 2,32,214
మాఫీఅయిన మొత్తం : రూ. 313.92 కోట్లు
ఖరీఫ్ రుణాలు
జిల్లాలో రైతులు : 4.50 లక్షలు
ఖరీఫ్ సీజన్‌లో కొత్త రుణాల లక్ష్యం : రూ. 1008 కోట్లు
రుణాల రీషెడ్యూల్ పొందిన రైతులు : లక్షా 40 వేలు
కొత్తగా రుణాలు పొందిన రైతుల సంఖ్య : 600
రీషెడ్యూలైన రుణం : రూ.629 కోట్లు
గరుగుబిల్లి మండలం గొట్టివలసకు చెందిన లక్ష్మునాయుడు బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకుని తనకున్న రెండెకరాలు సాగు చేసుకున్నాడు. టీడీపీ ప్రకటించిన మాఫీ ఆశతో తీసుకున్న బకాయి చెల్లించలేదు. రుణమాఫీ కాకపోవడంతో బకాయి కాస్తా వడ్డీతో కలిపి రెట్టింపయింది. కొత్తగా రుణంకోసం బ్యాంకు కెళ్తే పాత బకాయి తీర్చమని పట్టుబట్టారు. ఇక చేసేది లేక ప్రైవేటు వ్యాపారివద్ద అప్పు తీసుకుని ఈ ఏడాది వ్యవసాయం చేశాడు.
ఎస్‌కోట మండలం కృష్ణాపురానికి చెందిన అన్నపూర్ణ డ్వాక్రా రుణం తీసుకుని టీకొట్టు నడుపుతోంది. మాఫీ ఆశతో వాటిని చెల్లించకపోవడంతో కొత్తగా పెట్టుబడికి సమస్య ఏర్పడింది. బ్యాంకులు కొత్తగా రుణాలివ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఊళ్లో ఉన్న వడ్డీవ్యాపారి వద్ద అప్పుతీసుకుని వ్యాపారం పెంచుకుంది.
ఈ రెండు సంఘటనలే కాదు... అడుగడుగునా ప్రైవేటు వ్యాపారుల సహకారం లేనిదే ఎవరి బతుకులూ సజావుగా సాగలేదు. రుణమాఫీ జరిగి ఉంటే... బ్యాంకులు ఆదుకుని ఉంటే... ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా...!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కొందరికి పూట గడవడమే కష్టం. మరికొందరికి పూట గడుస్తుందే తప్ప ఇతర అవసరాలు తీరవు. పిల్లల్ని చదివించుకునేందుకు ఇంకొందరికి స్థోమత ఉండదు. పెళ్లిళ్లు చేసినా, రోగాలొచ్చినా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు పడే యాతన అంతా ఇంతా కాదు. ఇక రైతులైతే నిత్యం మదుపుల కోసం ఎన్ని బాధలు పడతారో చెప్పనక్కర్లేదు. ఆదుకోవల్సిన ప్రభుత్వం పట్టించుకోనపుడు... ప్రైవేటుగా అప్పులిచ్చినవారే ఆపద్బాంధవులు. ఇప్పుడు అప్పులిచ్చిన వారిపైనా ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆసరాను తీసేస్తోంది.
విజయవాడ నేపథ్యంలో...
విజయవాడ కాల్‌మనీ కేసు నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయడం, ఖాళీ బాండ్లు దొరికాయనే కారణంతో కేసులు నమోదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. టీడీపీ నాయకులను గట్టున పడేసే యత్నంలో భాగంగానే వ్యూహాత్మకంగా పోలీసులను ఉసిగొల్పారని చిన్న పిల్లాడినడిగినా ఇట్టే చెప్పగలరు. బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టిన చందంగా విజయవాడ కాల్‌మనీ వ్యాపారానికి ఇక్కడి వడ్డీ వ్యాపారానికి లింకు పెట్టి వేధిస్తే భవిష్యత్‌లో ఇక సామాన్యులకు అప్పులెలా లభిస్తాయన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న.
రుణమాఫీ జరిగి ఉంటే...
ఇప్పటికే ప్రభుత్వం రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని రుణమాఫీ పేరుతో మోసగించింది. ఎన్నికల హామీ ప్రకారం గతంలో తీసుకున్న రైతుల రుణాల్ని మాఫీ చేయలేదు. ఫలితంగా వారికి కొత్తగా బ్యాంకులు రుణాలివ్వలేదు. వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ముఖ్యంగా రైతుల్లో కొందరికి రుణాలు రీషెడ్యూల్ చేసి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి. మాఫీ కాని రైతులంతా అక్కడా ఇక్కడా అప్పులు చేసి సాగు చేశారు. కరువు నేపథ్యంలో పంటలు కూడా పోయాయి. చేసిన అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి వారిది. ప్రభుత్వం ఆదుకోలేదు సరికదా కేవలం మూడు మండలాల్ని కరువు ప్రాంతాలుగా గుర్తించి మమ అనిపించేసింది. మిగతా మండలాల రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇప్పుడు మళ్లీ సాగుకోసం అప్పులు చేయాలంటే బ్యాంకులు నిరాకరిస్తే.. ప్రైవేటు వ్యాపారులు భయపడుతుంటే వారి భవిష్యత్తు ఏమిటన్నది పాలకులే తేల్చాలి.