కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ శశిధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో 58వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ తొలుత జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల పంటలసాగు తగ్గిందన్నారు.
ప్రధాన పంట వేరుశనగ 53శాతం మాత్రమే సాగైందన్నారు. రబీకి అవసరమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందన్నారు. గత ఖరీఫ్ పంట నష్టానికి రూ. 52కోట్లు మంజూరు కాగా రూ. 47కోట్లను 54వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో కురిసిన వర్షాల్లో నష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ. 43లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా 9వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని, దీనిపై తుది నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపేందుకు ఎన్యుమరేషన్ చేపడుతున్నామన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ సంవత్సరం పీబీసీ ద్వారా 25వేల ఎకరాలకు, గండికోట ఎత్తిపోతల పథకం కింద 5వేల ఎకరాల నూతన ఆయకట్టుకు, వామికొండ రిజర్వాయర్ కింద 5వేల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల కోసం రూ. 488 కోట్ల రుణాలు మంజూరు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాజీవ్ యువకిరణాల కింద 9వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు.
బంగారు తల్లి పథకం క్రింద 2వేల మంది శిశువులను నమోదు చేయగా, అందులో 71 మందికి రూ. 2,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. గృహ నిర్మాణంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధిహామీ కింద ఇప్పటివరకు 17వేల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించామన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద 198 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 32వేల మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఏడవ విడతలో 10వేల మంది లబ్ధిదారులకు 16వేల ఎకరాల భూమిని త్వరలో పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు.
ఇందిరమ్మ అమృతహస్తం ద్వారా గర్భవతులు, బాలింతలు, శిశువులకు ఒక్కపూట భోజనం, పాలు, గుడ్లు అందిస్తున్నామన్నారు. మార్పు కార్యక్రమం ద్వారా మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యపరీక్షలు నిర్వహించడమేగాక 9వేల మందికి శస్త్ర చికిత్సల కోసం రూ. 25కోట్లు ఖర్చు చేశామన్నారు.
శకటాల ప్రదర్శన :
రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పోలీసుల మైన్‌ప్రూఫ్, వజ్ర, వ్యవసాయ శాఖ, డ్వామా, నిర్మల్ భారత్, ఇందిర జలప్రభ లబ్ధిదారులు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రాజీవ్ యువకిరణాలు లబ్ధిదారులు, 108 వాహనం, బంగారు తల్లి, ఉపాధిహామీ పథకం వాహనాలు పెరేడ్‌లో పాల్గొన్నాయి.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు :
నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల, జియోన్ ఉన్నత పాఠశాల, సాయిబాబా, మౌంట్‌ఫోర్ట్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో మౌంట్‌ఫోర్ట్ పాఠశాల విద్యార్థులకు మొదటి బహుమతి, సాయిబాబా పాఠశాల విద్యార్థులకు రెండవ బహుమతి, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు మూడవ బహుమతి, జియోన్ పాఠశాల విద్యార్థులు కన్సోలేషన్ బహుమతులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నుంచి అందుకున్నారు.
ఆస్తుల పంపిణీ :
డీఆర్‌డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, వికలాంగుల సహకార కార్పొరేషన్‌లకు చెందిన 4,335 మంది లబ్ధిదారులకు 1504.885 లక్షల రూపాయలు విలువ చేసే 456 యూనిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్‌ఓ ఈశ్వరయ్య, ఆర్డీఓ హరిత, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధికి చేయూత
Published Sat, Nov 2 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement