గుంటూరు నగరంలోని బార్‌లో తనిఖీ చేస్తున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలోని 83 బార్ అండ్ రెస్టారెంట్‌లపై సోమవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు 19 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని టీడీపీ నాయకుడికి చెందిన ఓ బార్‌లో ఫుల్ బాటిల్‌ను బయటికి పార్సిల్ చేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం బార్‌లలో మద్యాన్ని బయటికి విక్రయించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని బయటికి విక్రయించినట్‌లైతే సదరు బార్‌పై కేసు నమోదు చేసి లైసెన్స్ సస్పెండ్ చేస్తారు.
టీడీపీ నాయకుడి బార్‌లో ఫుల్ బాటిల్ మందు బయటకు విక్రయించినట్లు అధికారులు గుర్తించడంతో వెంటనే ఆయన జిల్లాకు చెందిన ఎక్సైజ్ ఉన్నతాధికారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో పాల్గొన్న ఎక్సైజ్ సీఐకు జిల్లా ఉన్నతాధికారి ఫోన్ చేసి బార్ యజమానికి తనకు కావాల్సిన వాడని చూసి చూడనట్లు వదిలేయమని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. బాస్ చెప్పడంతో సదరు టీడీపీ నాయకుడి బార్‌పై పార్సిల్ కేసు నమోదు చేయకుండా టెక్నికల్ కేసు నమోదు చేసి వదిలేసినట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్‌లపై 7 కేసులు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా డెప్యూటీ డైరెక్టర్(ఎఫ్‌ఏసీ) డాక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment