గొడవ జరిగిన బార్ ఇదే!
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధిలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచి ఉండడం, వాటిలో టీడీపీ నేతలు కూర్చొని సెటిల్‌మెంట్లకు పాల్పడడం తరచూ జరుగుతున్న సంఘటనలు. రెండురోజుల కిందట మంగళగిరి మున్సిపాలిటీ షాడో చైర్మన్ ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో సెటిల్‌మెంట్లు చేస్తుండగా పక్కనే మందు తాగుతున్న వారు పెద్దగా మాట్లాడడంతో ఆయనకు కోపం వచ్చి వారిపై దాడికి పాల్పడ్డాడు. అవతలివారు కూడా మందు బిగించి ఉండడంతో గొడవ కాస్తా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. దీంతో టీడీపీ నేతలు తమ బలాన్ని ఉపయోగించి వారిని చితకబాదారు. గాయపడ్డ యువకులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం, ఓ ముఖ్య నాయకుడు క్షణాల్లో అక్కడకు చేరి పోలీసు ఉన్నత వర్గాలతో ఫోన్‌లో మాట్లాడి కేసు నమోదు చేయకుండా చేశాడు. దీంతో తన్నులు తిన్న యువకులను బెదిరించడంతో పోలీసులు సైతం ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు.
షాడో చైర్మన్ లీలలు
మంగళగిరి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అయినప్పటికీ, అదే పార్టీలో చైర్మన్ సతీమణి వర్గానికి చెందిన ముఖ్య నాయకుడు మున్సిపాలిటీ పాలనలో చక్రం తిప్పుతున్నాడు. టెండర్ల నుంచి సెటిల్‌మెంట్ల వరకు స్వయంగా చూసుకుంటూ తనదైన శైలిలో కాంట్రాక్టర్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అందినకాడికి దోచుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి మున్సిపాలిటీకి చెందిన ఓ లాండ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి బార్‌లో మాట్లాడుతుండగా, పక్క టేబుల్‌పై టాటా స్కైలో ఉద్యోగం చేస్తున్న చిరుద్యోగులు నలుగురు మద్యం తాగుతున్నారు. వీరు కంపెనీ విషయాలపై చర్చించుకుంటూ పెద్దపెద్దగా మాట్లాడడంతో, సదరు నేతకు కోపం వచ్చింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచి యువకులపై చేయి చేసుకున్నాడు.
వారు కూడా ఎవరో తెలియక, లాగి గూబమీద కొట్టడంతో తట్టుకోలేని సదరు నాయకుడు ఫోన్‌లో తన అనుచరులను పిలిపించి, దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ గొడవలో ఓ యువకుడికి తలకు బీరు బాటిల్ తగలడంతో ఎనిమిది కుట్లు పడ్డాయి. మరో యువకుడికి ఛాతీపై బీరు బాటిల్ కోసుకుపోవడంతో రెండు కుట్లు పడ్డాయి. మిగతా ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన యువకులు మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు రాగా, పోలీసులు తమదైన శైలిలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఫిర్యాదు ఇస్తున్నా కూడా పట్టించుకోకుండా అందులో ఓ యువకుడిని సెల్‌లో కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు. వాస్తవానికి దెబ్బలు తగిలినవారిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో యువకులు బెదిరిపోయి పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment