
‘ఎక్సైజ్’లో రీలొకేషన్ దందా
జిల్లా ఎక్సైజ్ శాఖలో మరో అవినీతిపర్వానికి తెరలేచింది. మద్యం షాపుల రీలొకేషన్ పేరుతో వ్యాపారులకు అనువైన ప్రాంతాలకు మార్చి అధికారులు లక్షలు దండుకుంటున్నారు.
- ఎక్సైజ్ శాఖలో మరో అవినీతి పర్వం
- షాపు మార్చినందుకు లక్షల్లో వసూళ్లు
- జిల్లాలో 11 షాపులను మార్చిన అధికారులు
- నూతన షాపుల కేటాయింపులపై సర్వత్రా నిరసనలు
సాక్షి, విజయవాడ : జిల్లా ఎక్సైజ్ శాఖలో మరో అవినీతిపర్వానికి తెరలేచింది. మద్యం షాపుల రీలొకేషన్ పేరుతో వ్యాపారులకు అనువైన ప్రాంతాలకు మార్చి అధికారులు లక్షలు దండుకుంటున్నారు. గుడి, బడి నిబంధనలను, చట్టంలోని లొసుగుల ద్వారా అనుకూలంగా మార్చుకొని వ్యాపారుల ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా షాపు రీలొకేషన్ పేరుతో జిల్లాలో పలు షాపుల స్థానాలు మార్చి లక్షలు దండుకున్నారు. స్థానికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా ఎక్సైజ్ అధికారులు అనుకున్నది పూర్తి చేశారు.
జిల్లాలో 11 షాపులు మార్చటం ద్వారా సుమారు 20 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షాపు మార్చినందుకు విజయవాడ నగరంలో ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాల స్థాయికి అనుగుణంగా వసూళ్లు చేసినట్లు తెలిసింది.
మరో ఆదాయ వనరుగా...
ఒకవైపు బార్ రెన్యువల్స్ ద్వారా సాధారణ మామూళ్లు పొందుతున్న ఎక్సైజ్ అధికారులకు రీలొకేషన్ మరో ఆదాయ వనరుగా మారింది. స్థానిక సర్కిల్ ఎక్సైజ్ సీఐ సిఫార్సుల మేరకు, వివిధ రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు షాపులను మార్చారు. దీంతో వ్యాపారపరంగా సమస్యలు ఎదురు కావటంతో పాటు, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గతంలో కొన్ని షాపుల్లో వ్యాపారులు ఆశించిన మేరకు విక్రయాలు జరగలేదు. దీంతో పలు కారణాలను సాకుగా చూపి షాపును రిలొకేట్ చేయటానికి పలువురు వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు అందినదే తడవుగా ఎక్సైజ్ అధికారులు రిలొకేట్ పేరుతో అధికారులు వాటిని మార్చేశారు. వాస్తవానికి గుడికి, బడికి 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఎర్పాటు చేయాలని ఎక్సైజ్ చట్టం చెబుతోంది.
అది కూడా దేవాదాయ శాఖ గుర్తించిన దేవాలయాలు, విద్యాశాఖ గుర్తింపు ఉన్న పాఠశాలలకు మాత్రమే చట్టం వర్తిస్తుంది. వాస్తవానికి అత్యధిక దేవాలయాలు, మందిరాలకు దేవాదాయ శాఖ గుర్తింపు ఉండదు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో దేవాలయాలు, మందిరాలు, చర్చిల సమీపంలోనే షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు. తాజాగా రీ లొకేట్‌లో కేటాయించిన షాపులు కొన్ని గుడికి, బడికి దగ్గరగా ఉన్నాయి.
రీలోకేషన్ వసూళ్లు ఇలా...
రీలొకేషన్ పేరుతో ఎక్సైజ్ శాఖలో సీఐ స్థాయి నుంచి అధికారుల వరకు భారీగా వసూళ్లు చేశారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఏడు షాపులను రీలొకేట్ చేశారు. దీనికి గాను ఒక్కో షాపు నుంచి రూ లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారు. విజయవాడ నగరంతో పాటు నందిగామలోని మాగల్లు, నూజివీడులోని అడవినెక్కలం, మచిలీపట్నం డివిజన్‌లోని అవనిగడ్డ, మచిలీపట్నంలో షాపులను రీలొకేట్ చేశారు. రోజుకు సగటున 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయాలు జరిగే షాపునకు లక్ష రూపాయలు చొప్పున గ్రామీణ ప్రాంతంలో వసూళ్లు చేశారు. ఈ వ్యవహారమంతా స్థానిక సీఐలే నిర్వర్తించి వసూళ్లు పూర్తి చేసి, అధికారుల స్థాయి వరకు అందరికీ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.