
మెగా మెట్రో
విస్తరిస్తున్న మెట్రో ప్రాజెక్టు
తొలిదశలోనే రాజధానికి అనుసంధానం
మలి దశలో కుమ్మరిపాలెం వరకూ..
ఇంద్రకీలాద్రిని తొలచి సొరంగమార్గం
విజయవాడ బ్యూరో : నగరంలోని బందరు, ఏలూరు రోడ్లకే పరిమితమనుకున్న మెట్రో రైలు ప్రాజెక్టు అంతకంతకూ విస్తరిస్తోంది. తొలి దశలోనే రాజధాని నగరానికి మెట్రో రైలు వెళ్లనుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టును తుళ్లూరు వరకూ పొడిగించాలని నిర్ణయించారు. ఇందుకోసం బస్టాండ్ సమీపంలో కృష్ణలంక వైపు నుంచి తాడేపల్లి వరకూ కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించడానికి డిజైన్ కూడా రూపొందించారు. తాడేపల్లి సీతానగరం కొండ మీదుగా తుళ్లూరుకు మెట్రో కారిడార్‌ను నిర్మించనున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ వచ్చిన వెంటనే ఈ కారిడార్‌కు రూపకల్పన చేసేందుకు రాష్ట్ర మెట్రో ప్రాజెక్టులకు డీపీఆర్‌లు తయారుస్తున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్ తదితర ముఖ్య కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటవుతాయనే విషయం తెలియజేసే కాన్సెప్ట్ ప్లాన్ వచ్చినా, తుళ్లూరు మెట్రో కారిడార్‌కు రూపకల్పన చేసే అవకాశం ఉంటుందని డీఎంఆర్‌సీ అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి నేరుగా తుళ్లూరు వెళ్లేలా ఈ మెట్రో రైలు మార్గాన్ని రూపొందించనున్నారు. ఈ కారిడార్ 20 నుంచి 25 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉంది. దీంతో తొలి దశలోనే మూడు కారిడార్లు కలిపి 40 కిలోమీటర్లకుపైగా మెట్రో ప్రాజెక్టు ఏర్పడనుంది.
రెండో దశ ఇలా...
రెండో దశలో మెట్రో ప్రాజెక్టును హైదరాబాద్ రూటుకు అనుసంధానం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఏలూరు రోడ్డు కారిడార్‌ను పొడిగించనున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండడం, కనకదుర్గమ్మ గుడి వద్ద రోడ్డు ఇంకా సన్నగా ఉండడంతో ఈ కారిడార్‌ను అటువైపు నుంచి నిర్మించే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాంతంలో ఇంద్రకీలాద్రిని తొలచి సొరంగం మార్గంలో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కూడా తయారుచేశారు. నిడమానూరు సమీపంలో బెస్ట్‌ప్రైస్ షోరూమ్ వరకు ఉన్న ఏలూరు రోడ్డు కారిడార్‌ను గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు పొడిగించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు నుంచి రాజధాని నగరాన్ని అనుసంధానించాలని భావిస్తున్నారు. ఈ పొడిగింపును తొలి దశలో చేపట్టాలా.. మలి దశలో చేపట్టాలా.. అనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ఈ మొత్తం ప్రాజెక్టును సీఆర్‌డీఏ పరిధిలోని కీలక ప్రాంతాలైన గుంటూరు, తెనాలి, మంగళగిరికి హైస్పీడ్ సబర్బన్ రైల్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. తద్వారా రాజధాని రీజియన్‌లోని కీలక ప్రాంతాలను మెట్రో, సబర్బన్ రైల్ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకువచ్చి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని యోచిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ శుక్రవారం నగరానికి వచ్చిన రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహదారు శ్రీధరన్ సమీక్షించారు.