కొల్లేరులో రక్తచరిత్ర | faction history repeats in kolleru | Sakshi
Sakshi News home page

కొల్లేరులో రక్తచరిత్ర

Published Wed, Nov 20 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

faction history repeats in kolleru

భీమడోలు/ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : ప్రశాంతంగా ఉండే కొల్లేటి గ్రామం చెట్టున్నపాడు భగ్గుమంది. చెరువు లీజు సొమ్ము విషయమై రెండువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారి హత్యలకు దారితీసింది. ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన దేవదాసు లలిత్ (64) అనే వృద్ధుడు, నేతల రంగరాజు (50), బొంతు జయరాజు (50) హత్యకు గురయ్యూరు. రెండువర్గాల మధ్య కక్షలను చల్లార్చలేని అధికారుల వైఫల్యం, ప్రత్యర్థుల కిరాతకం వెరసి మూడు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి భీమడోలు మండలం చెట్టున్నపాడులో చోటుచేసుకున్న ఈ హత్యలు జిల్లా కేంద్రాన్ని కుదిపేశాయి. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులపై బాధిత కుటుంబాలు విరుచుకుపడ్డాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో సీఐను నిర్బంధించి ధర్నా చేశారు. తిరిగి ఊరు వెళితే ప్రత్యర్థులు చంపేస్తారని మొత్తుకున్నా పట్టించుకోని పోలీసు, రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని బాధితులు ఫైర్‌స్టేషన్ వద్ద అర్థరాత్రి వరకూ మృతదేహాలతో రాస్తారోకో చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 
 లీజు సొమ్ము పంపకాల్లో తేడాలు
 భీమడోలు మండలం చెట్టున్నపాడు గ్రామస్తులకు 73 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. దానిని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లీజుకు ఇచ్చారు. అలా వచ్చిన సొమ్మును 552 వాటాలు వేసి గ్రామస్తులకు పంచుతుంటారు. ఈ వ్యవహారాన్ని గ్రామ పెద్దల కమిటీ నిర్వహించేది. కొంతకాలం క్రితం కమిటీ మారడంతో గొడవలు మొదలయ్యాయి. పాత కమిటీ, కొత్త కమిటీల మధ్య లీజు సొమ్ము పంపకాల వివాదం ఏర్పడింది. దీంతో గ్రామం రెండు వర్గాలుగా విడిపోయింది. నేతల రంగరాజు పాత కమిటీ వర్గానికి, చిగురుపాటి రత్నాకరరావు కొత్త పెద్దల కమిటీకి నేతృత్వం వహించేవారు. రెండువర్గాలు గొడవలు పడుతూనే సొమ్ములు పంచుకునేవారు.
 
 లీజు మారడంతో వివాదం
 ఐదేళ్ల క్రితం పైడిచింతపాడు గ్రామానికి చెందిన ముంగర వెంకటేశ్వరరావు, కూచింపూడి అచ్యుతరాజులకు సంవత్సరానికి రూ.15 లక్షల చొప్పున చెరువును లీజుకిచ్చారు. కొద్దినెలల క్రితం గడువు ముగియడంతో లీజుదారుడు ప్రస్తుత గ్రామ కమిటీ పెద్ద రత్నాకరరావు వద్దకు వెళ్లి లీజు ఒప్పం దాన్ని పొడిగించుకున్నారు. తమకు తెలియకుండా మళ్లీ లీజు ఎలా తీసుకుంటారని, కొత్త కమిటీకి ఇచ్చిన సొమ్ములో తమ వాటా తమకివ్వాలని పాత కమిటీకి చెందిన రత్నరాజు ఆగస్టు 2న లీజుదారులను అడిగారు. అయినా లీజుదారులు కొత్త కమిటీకే డబ్బు ఇచ్చారు. దీంతో రంగరాజు వర్గానికి చెందినవారు అదేరోజు లీజుదారుల ఇంటికి వెళ్లి నిలదీశారు. అక్కడ రంగరాజు వర్గానికి, లీజుదారులకు గొడవ జరిగింది. దీనిపై రంగరాజు వర్గం భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కేసు పోలీస్‌స్టేషన్ నుంచి తహసిల్దార్ కార్యాలయానికి, అక్కడి నుంచి ఏలూరు ఆర్డీవో కోర్టుకు బదిలీ అయింది. మూడు నెలల నుంచి రెండువర్గాల వారు ఏలూరు ఆర్డీవో కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. వివాదం సర్దుబాటు కాలేదు. ఈ సమయంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు.
 
 ఆర్డీవో సమక్షంలోనే ఘర్షణ
 సోమవారం ఉదయం ఏలూరు ఆర్డీవో కోర్టుకు రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు హాజరయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో ఆర్డీవో శ్రీనివాస్ ఇరువర్గాలను తన కార్యాలయంలో విచారించారు. అదే సమయంలో ఏలూరు డీఎస్పీ రజనీ, భీమడోలు తహసిల్దార్ సోమశేఖర్ కూడా అక్కడ ఉన్నారు. చెరువు లీజు తదితర విషయాలను వివరిస్తూనే రెండువర్గాలు ఆర్డీవో, డీఎస్పీ ఎదుటే గొడవకు దిగారు. దీంతో ఆర్డీవో శ్రీనివాస్ రెండువర్గాల వారిని బయటకు పంపివేసి కేసును టి. నర్సాపురం కోర్టుకు ఈ నెల 26కి వాయిదా వేశారు. బయటకు వచ్చిన వెంటనే రెండువర్గాల వారు మళ్లీ గొడవపడ్డారు. ఈ సమయంలోనే రత్నాకరరావు అతని అనుచరులు గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తామని రంగరాజు వర్గాన్ని బెదిరించినట్టు బాధితులు చెబుతున్నారు.
 
 పట్టించుకోని పోలీసులు
 ప్రత్యర్థి వర్గం బెదిరింపులతో భయపడిన రంగరాజు వర్గీయులు ప్రత్యర్థులు తమను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని బయటకు వస్తున్న డీఎస్పీ రజనీని అడిగారు. ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో రంగరాజు వర్గంలోని జయరాజు, లలిత్, రాజ్‌కుమార్, బాబూరావు, జోజప్ప, జయమ్మ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఏలూరు నుంచి  నాలుగు మోటార్ సైకిళ్లపై చెట్టున్నపాడు బయలుదేరారు. వారు గ్రామంలోకి వస్తున్నట్టు  ప్రత్యర్థి వర్గానికి సమాచారం అందింది. గ్రామ శివారున గల ఒక పాకలో మాటువేసిన ప్రత్యర్థులు సరుగుడు బాదులు, కర్రలతో దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రక్తపుమడుగులో స్పృహతప్పి పడి ఉన్న వారిని చాలాసేపు కొట్టారని బతికిబయటపడిన వారు రోదిస్తూ చెబుతున్నారు. కొద్దిసేపటికి అందులో ఒకరు గ్రామంలోకి వెళ్ళి విషయాన్ని చెప్పడంతో వారు భీమడోలు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో 100కి ఫోన్ చేశారు. ఈలోపు ప్రత్యర్థులు గ్రామంలో ఉన్న రంగరాజు మనుషుల ఇళ్లకు వెళ్లి దాడులు చేశారు. కొంతసేపటి తర్వాత గ్రామం నుంచి రంగరాజు వర్గం మనుషులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న వారిని ఆటోల్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రంగరాజు, జయరాజు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. లలిత్, రాజ్‌కుమార్ బాబూరావు, జోజప్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో లలిత్ మృతి చెందడంతో అతన్ని తిరిగి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు.  
 
 ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
 తమవారు మృతి చెందడంతో బాధిత కుటుంబాలకు చెందినవారు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని భోరున విలపించారు.  ప్రత్యర్థుల చేతిలో మృతి చెందిన జయరాజు, రంగరాజు, లలిత్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తమ వారు చనిపోయారని, ఏలూరు డీఎస్పీ, భీమడోలు సీఐ, ఎస్‌ఐలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇంతలో భీమడోలు సీఐ భాస్కరరావు ఆసుపత్రికి చేరుకోవడంతో బాధితులు ఆయనను ఓపీ రూంలో నిర్బంధించారు. తమకు న్యాయం చేసేవరకూ సీఐను వెళ్లనీయమని విరుచుకుపడ్డారు.
 
 బాధితులపై విరుచుకుపడిన పోలీసులు
 బాధితుల ఆందోళన అదుపు తప్పుతుందనే అంచనాతో పోలీసు ఉన్నతాధికారులు మరో బెటాలియన్‌ను రంగంలోకి దించారు. బాధితులు వారిని చూసి మరింత రెచ్చిపోయారు. దీంతో పోలీసులు, బాధితుల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు బాధితులను ఆస్పత్రి బయటకు పంపిం చడంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
 మృతదేహాలతో అర్ధరాత్రి వరకూ రాస్తారోకో
 మృతదేహాలను ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఉంచి చెట్టున్నపాడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మూడు మృతదేహాలను మూడువైపులా ఉంచి రాస్తారోకో చేశారు. అధికారులు ఎంతగా బతిమిలాడినా వినలేదు. డీఎస్పీ రజని, సీఐ భాస్కరరావును సస్పెండ్ చేస్తేనే ఆందోళన విరమిస్తామని తెగేసి చెప్పారు. రాత్రి 9.30 గంటల సమయంలో డీఆర్వో ప్రభాకరరావు మాట్లాడినా వినకపోవడంతో కలెక్టర్ సిద్ధార్థజైన్, ఎస్పీ హరికృష్ణ బాధితులతో చర్చలు జరిపారు.
 
 కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
 రాత్రి 10.30 గంటల వరకు రాస్తారోకో  కొనసాగగా అక్కడకు చేరుకున్న జిల్లా కలెక్టర్ సిద్ధార్‌‌థజైన్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డీఎస్పీ, సీఐలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎస్పీ హరికృష్ణ చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబాలు, గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement