
హామీలు అమలు చేయడంలో విఫలం
రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ
ఒంగోలు టౌన్ : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ఎన్నికల సమయంలో రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ధ్వజమెత్తారు. రైతు కూలీల సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఈమనిపాలెంలో నిర్మించిన జిల్లా రైతు కూలీ సంఘం (తరిమెల నాగిరెడ్డి) భవనాన్ని ఆదివారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఏఐఎఫ్‌టీయూ(న్యూ) నాయకుడు డీవీఎన్ స్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టసభలను, ఎన్నికలను కూడా పోరాట వేదికలుగా ఉపయోగించుకున్న మార్కిస్టు, లెనినిస్టు మేధావిగా నాగిరెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. తరిమెల నాగిరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన రైతు కూలీ సంఘం కేంద్రాలు ప్రతి పట్టణంలో ఏర్పాటు కావాలని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) జాతీయ అ«ధ్యక్షుడు గుర్రం విజయకుమార్ పిలుపునిచ్చారు.
ప్రజాతంత్ర, హేతువాద భావజాలాలను పెంపొందించే కేంద్రంగా విరజిల్లాలన్నారు. రాష్ట్రంలోని టీడీపీ పోలవరం ప్రాజెక్టు పరిధిలో అర్హులైన పేదలకు నష్టపరిహారం ఇవ్వకుండా భూస్వాములకు ఇస్తుందని విమర్శించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలితకుమారి మాట్లాడుతూ జిల్లాలోని రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యర్రంనేని కోటేశ్వరరావు, భవన నిర్మాణ కమిటీ నాయకుడు పంగులూరి గోవిందయ్య, జిల్లా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చుండూరి రంగారావు, సుపరిపాలన వేదిక నాయకులు టీ గోపాల్‌రెడ్డి, షంషీర్‌అహ్మద్, సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, సీపీఐ నాయకుడు ఉప్పుటూరి ప్రకాశరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) నాయకుడు కొంగర నరసింహం తదితరులు పాల్గొన్నారు.