అన్నదాతపై నకిలీల వల | fakes net on annadatta | Sakshi
Sakshi News home page

అన్నదాతపై నకిలీల వల

Published Mon, Jun 30 2014 3:15 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

అన్నదాతపై నకిలీల వల - Sakshi

అన్నదాతపై నకిలీల వల

- రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద
- దుకాణాలపై కొరవడిన నిఘా
- నట్టేట మునుగుతున్న రైతులు
- పట్టించుకోని ప్రభుత్వం, అధికార యంత్రాంగం
 ఒంగోలు టూటౌన్:
జిల్లాలో ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారుల నిఘా కొరవడింది. కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులతో అన్నదాతను నిలువునా ముంచుతున్నారు. అక్షర జ్ఞానం లేని రైతులను ఏదోఒక విధంగా నాణ్యత పేరుతో దోపిడీ చేయడం పరిపాటిగా మారింది. నకిలీల బెడద నుంచిరైతులను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

- జిల్లాలో 12 వ్యవసాయ డివిజన్లున్నాయి. సుమారుగా 500 వరకు విత్తన దుకాణాలు, 670 ఎరువుల దుకాణాలు ఉన్నాయి. లెసైన్స్ లేని దుకాణాలు సైతం లేకపోలేదు. ఏయే దుకాణంలో ఎంతెంత నిల్వలున్నాయో కూడా అధికారులకు తెలియని పరిస్థితి.
- కొంతమంది వ్యాపారులు ఎరువులకు అనుమతులు కూడా లేకుండా బ్లాక్ మార్కెట్‌గా అమ్ముతూ పట్టుపడుతున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు విజిలెన్స్ అధికారులు నామమాత్ర దాడులతో సరిపెట్టుకుంటూ మమ అని పిస్తున్నారు. ఆ తరువాత విత్తనాలు, ఎరువుల దుకాణాలపై నిఘా లేకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది.

- ప్రభుత్వం కూడా సీజన్‌లో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం అన్నదాతకు శాపంగా మారింది. దీంతో ప్రైవేట్ వ్యాపారుల హవా కొనసాగుతోంది.
- ఇటీవల ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తేనే అనేక అక్రమాలు వెలుగు చూశాయి. గిద్దలూరు, కంభంలలో రెండు దుకాణాలపై దాడులు చేసి 28 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. అనుమతులు లేని కారణంగా 87 టన్నుల ఎరువులను నిలుపుదల చేశారు.
- యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లో వ్యవసాయ అధికారుల బృందాలు దాడులు చేశాయి.  24 లక్షల 67 వేల విలువైన విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ జె మురళీకృష్ణ తెలిపారు. నకిలీవని అనుమానం వచ్చిన విత్తనాలను లేబొరేటరీకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.   

- ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో కోట్ల రూపాయలను ఎరువులు, పురుగుమందుల, విత్తనాల కొనుగోలుకు రైతులు కుమ్మరిస్తున్నారు. రైతుల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు కావడంతో విత్తనాలు, ఎరువుల దుకాణ దారుల చేతిలో నిత్యం మోసపోతూనే ఉన్నారు. ఏది నకిలీదో.. ఏది మంచిదో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
- పురుగు మందులు, ఎరువులు, విత్తనాలపై చైతన్య పర్చాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. పైగా ఎరువుల వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై దాడులకు వెనకాడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై నిఘా ఉంచి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement