కూతురొస్తుందని ఊరొదిలి..
రామాయంపేట, న్యూస్‌లైన్: ఆడపడుచు వస్తుందంటే చాలు ఆ కుటుంబంలో ఆనందానికి అవధులుండవు. మా ఇంటి మహాలక్ష్మి వస్తుందంటూ తల్లిదండ్రులు గర్వంగా ఫీలవుతారు. ఇళ్లంతా సందడిగా ఉంటుంది. కానీ తమ కూతురు ఊర్లో అడుగుపెడుతుందన్న సమాచారంతో ఓ కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసి గొడ్డుగోదా వదిలి వెళ్లిపోయారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లిలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గొల్ల సాయిలు కుమార్తె సరిత అదే గ్రామానికి చెందిన మహిపాల్ జూలై 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరుకుటుంబాలతో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ జంట ఆరునెలలుగా రంగారెడ్డి జిల్లా అల్వాల్‌లో నివాసం ఉంటోంది.
కాగా, సరిత, మహిపాల్ శుక్రవారం సాయంత్రం సొంతూరుకు వెళ్లాలనుకున్నారు. సరిత రామాయంపేట నుంచి తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడి ఊళ్లోకి అనుమతించాలని వేడుకుంది. ‘మీరొస్తే మా పరువు ఏం కావాలి? మేం ఇక్కడ ఉండలేం’ అని తండ్రి తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో సరిత తన భర్త మహిపాల్‌తో కలిసి వెనుదిరిగింది. అరుునప్పటికీ.. కూతురు ఊళ్లోకి వస్తుందేమోనన్న అనుమానంతో గొల్ల సాయిలు తన సోదరులతో కలసి మొత్తం నాలుగు కుటుంబాలు శుక్రవారం సాయంత్రం ఇళ్లకు తాళాలు వేసి గొడ్డుగోదాను వదిలి వెళ్లిపోయారు.