రైతన్నకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు జిల్లాలో వేల హెక్టర్లలో పంటలు నేలవాలాయి.
వారం రోజులుగా వాన
దెబ్బతిన్న మొక్కజొన్న.. నేలవాలిన వరి పైరు..
మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య
నిర్మల్(మామడ), న్యూస్‌లైన్ :
రైతన్నకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు జిల్లాలో వేల హెక్టర్లలో పంటలు నేలవాలాయి. పంటలను చూసిన రైతులు మనస్తాపం చెందుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం మామడ మండలం కమల్‌కోట్ గ్రామానికి చెందిన రైతు రేని పెద్దోల్ల మల్లేష్(28) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్లేష్ తనకున్న రెండెకరాల్లో ఒక ఎకరం మొక్కజొన్న, ఒక ఎకరంలో వరి పంటను సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతినడంతోపాటు వరి పైరుకు తెగులు ఆశించింది.
ఉదయం చేను వద్దకు వెళ్లాడు. దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపం చెందాడు. సాగు కోసం బ్యాంకులో రూ.60 వేల అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలని సాయంత్రం ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు నిర్మల్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందాడు. మల్లేష్‌కు భార్య లత, ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, వర్షిత ఉన్నారు.ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మల్లేష్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.