వచ్చేస్తోంది.. | farmers are waiting for input subsidy schemes | Sakshi
Sakshi News home page

వచ్చేస్తోంది..

Published Wed, Dec 25 2013 1:50 AM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM

ఇదిగో అదిగో అంటూ నెలల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు ఎట్టకేలకు త్వరలోనే ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) పరిహారం అందనుంది.

అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఇదిగో అదిగో అంటూ నెలల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు ఎట్టకేలకు త్వరలోనే ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) పరిహారం అందనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేయడం రైతులకు ఊరట కలిగించింది.
 
 జిల్లాకు రూ.263.26 కోట్లు పరిహారం విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 2011, 2012 సంవత్సరాల ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గతేడాది నీలం తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలకు రూ.427.03 కోట్లు ఇవ్వనుండగా అందులో ‘అనంత’కు అత్యధికంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2011కు సంబంధించి 55,855 మంది రైతులకు రూ.42.12 కోట్లు, 2012కు సంబంధించి 2,11,666 మంది రైతులకు రూ.221.14 కోట్లు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తమ్మీద 2,67,521 మంది రైతులకు పంపిణీ చేయడానికి వీలుగా రూ.263.26 కోట్లు మంజూరు చేశారు.
 
 నాలుగు ఇన్‌పుట్ జాబితాలకు
 గాను మూడింటికి అనుమతి...
 2011, 2012కు సంబంధించి పరిహారం విడుదల చేయాలని కొన్ని నెలల కిందట జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నాలుగు జాబితాలు పంపారు. మొత్తం 3.26 లక్షల మంది రైతులకు గాను రూ.394 కోట్ల పరిహారం విడుదల చేయాలని కోరారు. అందులో 2011కు సంబంధించి 69,408 మంది రైతులకు సరిపడా రూ.43.98 కోట్లతో మిస్‌మ్యాచింగ్ జాబితా తయారు చేసి పంపారు. మరొక జాబితాలో 47,633  మందికి అందజేయడానికి వీలుగా రూ.28.40 కోట్లు అవసరమని నివేదించారు.
 
 ఈ రెండింటిలో మొదటి జాబితాకు రూ.1.86 కోట్లు కోత వేసి మిగతా రూ.42.12 కోట్లకు అనుమతి ఇచ్చారు. 2012 ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించి రెండో విడతగా 24 మండలాలకు చెందిన 1.95 లక్షల మంది రైతులకు రూ.206.75 కోట్లతో ఒక జాబితా పంపగా, 14 వేల మంది రైతులకు సరిపడా రూ.14.39 కోట్లతో మరొక జాబితా పంపారు. ప్రస్తుతానికి ఈ రెండింటికీ అనుమతి ఇచ్చారు. పంపిన నాలుగు జాబితాల్లో ఇంకా 57 వేల మంది రైతులకు గాను రూ.31 కోట్లు విడుదల కావాల్సివుంది. అది విడుదల చేస్తారా లేదా అనేది చెప్పడం లేదు. ఇదిలా ఉండగా... 2011కు సంబంధించి విడుదల చేసిన పరిహారం వెంటనే బ్యాంకుల్లో జమ చేసే పరిస్థితి ఉండగా... 2012కు సంబంధించి విడుదల చేసిన పరిహారం బ్యాంకుల్లో వేయడానికి తొలి విడత పంపిణీ అడ్డంకిగా మారింది.
 
 తొలి విడతగా 39 మండలాల రైతులకు రూ.407.16 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో రూ.378 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా మిగతాది మిస్ మ్యాచింగ్ జాబితాలో మిగిలిపోయింది. పంపిణీ  చేసినది, మిస్ మ్యాచింగ్‌లో మిగిలిపోయిన పరిహారానికి బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు-యూసీలు) వస్తేకాని ట్రెజరీ అధికారులు పరిహారం విడుదల చేసే పరిస్థితి లేదు. గత నెల రోజులుగా తిరుగుతున్నా తొలి విడత యూసీలు సగం కూడా సేకరించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ యూసీల సేకరణ యుద్ధప్రాతిపదికన చేపడితే సకాలంలో రెండో విడత పరిహారం విడుదలకు మార్గం సుగమమవుతుంది.
 
 జనవరి మొదటి వారంలో పంపిణీ..
 ఇన్‌పుట్ పరిహారం విడుదలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం కానీ జీవో కాని రాలేదని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రేపోమాపో వచ్చినా యూసీల విషయం, బిల్లులు సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. అన్నీ సవ్యంగా జరిగితే జనవరి మొదటి వారంలో బ్యాంకుల్లో జమ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆ తరువాత బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement