సాక్షి ప్రతినిధి, అనంతపురం : దుర్భిక్ష ‘అనంత’ నుంచి చివరకు ఆర్మీ ఫైరింగ్ రేంజ్ కూడా చేజారిపోయింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్) క్షిపణి పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయలేమని రక్షణ శాఖ స్పష్టీకరించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి వర్తమానం పంపింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను డీ-నోటిఫై చేయడంలో అధికారులు జాప్యం చేస్తుండటం రైతులకు శాపంగా మారుతోంది. పంట రుణాలు, ఏపీఎంఐపీ(ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం) వంటి పథకాల కింద లబ్ధి పొందలేని దుస్థితిలో రైతులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో నెలకొల్పుతామని కేంద్రం ప్రకటించిన ఐఐఎస్‌సీ, నిట్ కేంద్రాలను ఏర్పాటు చేయలేమని తేల్చి చెప్పిన విషయం విదితమే.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలో రూ.650 కోట్ల వ్యయంతో క్షిపణి తయారీ పరిశ్రమ ఏర్పాటుకు 2008లో బీడీఎల్ ముందుకొచ్చింది. ఆ పరిశ్రమలో తయారు చేసిన క్షిపణిలను పరీక్షించడం.. ఫైరింగ్‌లో సైనికులకు శిక్షణను ఇవ్వడం కోసం జిల్లాలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయడానికి రక్షణ శాఖ అంగీకారం తెలిపింది. ఆ మేరకు భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కనగానపల్లి, కంబదూరు మండలాల్లో రాళ్ల అనంతపురం, కర్తనపర్తి, డి.చెన్నేపల్లి, నూతిమడుగు, రామోజీనాయక్ తండా, మద్దెలచెర్వు, మద్దెలచెర్వు తండా, కోనేటిపాళ్యం, శివపురం గ్రామాల్లో 15,200 ఎకరాలను ఫైరింగ్ రేంజ్‌కు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు ఆ ప్రాంతం అనుకూలమంటూ సైనిక అధికారులు పంపిన నివేదికపై కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 2008లోనే జారీ చేసింది. ఈ నిర్ణయం వెలువడిన 15 రోజుల్లోగానే రక్షణ శాఖ సర్వే బృందం ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించి.. భూమిని సర్వే చేసింది. సరిహద్దులు నాటింది. రక్షణ శాఖ ఆదేశాల మేరకు.. తొలి విడతగా రాళ్ల అనంతపురంలో 2,464, కర్తనపర్తిలో 2,145, నూతిమడుగులో 1,438, మద్దెలచెర్వు తండాలో 2,311, కోనేటిపాళ్యంలో 2,337.. మొత్తం 10,695 ఎకరాలను సేకరించడానికి ప్రణాళిక రచించింది. రెండో విడతగా 4,564 ఎకరాలను సేకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 15,200 ఎకరాల భూసేకరణకు రూ.384 కోట్లు, ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుతో కనుమరుగయ్యే డి.చెన్నేపల్లి, మద్దెలచెర్వు తండా, రామోజీనాయక్ తండా ప్రజలకు పునరావాసం కల్పించడానికి రూ.ఐదు కోట్లు అవసరమంటూ జిల్లా అధికారులు సహాయ, పునరావాస ప్యాకేజీని కూడా కేంద్రానికి పంపారు.
ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే.. ఐదేళ్లుగా ఆ తొమ్మిది గ్రామాల్లోనూ పంట రుణాల పంపిణీ, సూక్ష్మ నీటి పారుదల పథకం, ఉపాధి హామీ పథకం, ఉద్యానవన పథకాల అమలును నిలిపివేశారు. కేంద్ర రక్షణ శాఖ ఎంతకూ భూసేకరణ చేయకపోవడం.. పరిహారం ఇవ్వక పోవడంతో రైతుల దీనావస్థలపై 2010 ఆగస్టు 6న ‘వీళ్లేం పాకిస్థానీలా?’ శీర్షికన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అదే రోజున జిల్లాలో పర్యటించిన అప్పటి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎం.పళ్లంరాజు తక్షణమే భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటిదాకా ఒక్క పైసా నిధులను కూడా విడుదల చేయలేదు.
హిందూపురం పరిసర ప్రాంతాల్లో కేటాయించిన భూమిని అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీడీఎల్ పరిశ్రమ నిర్మాణానికి నోచుకోలేదు. క్షిపణి పరిశ్రమను బీడీఎల్ ఏర్పాటు చేసి ఉంటే.. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉండేది. కానీ.. బీడీఎల్ పరిశ్రమే ఏర్పాటు చేయని నేపథ్యంలో.. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ కూడా ఏర్పాటు చేయలేమని రక్షణ శాఖ చేతులెత్తేసింది. భూసేకరణ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయలేమంటూ జిల్లా అధికార యంత్రాంగానికి రక్షణ శాఖ వర్తమానం పంపింది. రక్షణ శాఖ వర్తమానం నేపథ్యంలో ఆర్మీ ఫైరింగ్ ఏర్పాటుకు నోటిఫై చేసిన భూమిని డీనోటిఫై చేయాలి. కానీ.. అధికార యంత్రాంగం డీనోటిఫై చేయకపోవడం వల్ల రైతులు కనీసం రబీ పంటల రుణాలను కూడా పొందలేని దుస్థితి నెలకొంది.
ఇదీ పాయే..
Published Tue, Nov 19 2013 3:45 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement