ప్రజాసంక్షేమానికి పోరాటం | Fight for people says ys jagan mohanreddy | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమానికి పోరాటం

Published Fri, Jun 13 2014 2:08 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

ప్రజాసంక్షేమానికి పోరాటం - Sakshi

ప్రజాసంక్షేమానికి పోరాటం

వైఎస్సార్ సీపీ శ్రేణులకు అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు  ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందొద్దు.. భవిష్యత్తు మనదే
 
పది రోజుల్లో బాబు బండారం బయటపడుతుంది
టీడీపీ విష ప్రచారాలను వెంటనే తిప్పికొట్టాలి
క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తాం
మూడు నెలలకోసారి సమీక్షా సమావేశాలు

 
విశాఖపట్నం: ఎన్నికల ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన పనిలేదని, భవిష్యత్తు తమదేనని, అందుకు చేయాల్సిందల్లా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘‘సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ప్రజావ్యతిరేకత రావాలంటే రెండేళ్లు పడుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం పదిరోజుల్లోనే ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంటుంది. ఎందుకంటే అధికారంకోసం ఆయన ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మోసపుచ్చారు. వాటిని ఆయన అమలు చేయలేరని మరో పదిరోజుల్లోనే తేలిపోతుంది. ఆ హామీలు అమలు చేయాలని ఇంటికి ఒకర్ని కూడగట్టి ఉద్యమిద్దాం. ఓ వైపు ప్రజా సంక్షే మం కోసం ఉద్యమపథంలో సాగుతూనే మరోవైపు పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ట పరుద్దాం’’ అని సూచించారు. ఎన్నికల ఫలితాల సమీక్షా సమావేశాల్లో భాగంగా గురువారం విశాఖలో ఆయన ఆ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. భీమిలి, ఎస్.కోట, విశాఖపట్నం తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల ఫలితాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

హామీలన్నీ అమలు చేయాలని ఒత్తిడి తెద్దాం..

చంద్రబాబు అసాధ్యమని తెలిసీ అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసగించారు. అవి అమలు కావని మరో పదిరోజుల్లో తేలిపోతుంది. పాత రుణాలు తీరిస్తే కానీ బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వబోమని చెబుతాయి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను లేకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2కోట్ల ఇళ్లు ఉన్నాయి. అవ్వలు, తాతలకు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పింఛను ఇస్తానని కూడా చంద్రబాబు చెప్పారు. ప్రజల్ని కూడగట్టి ఈ హామీల అమలు కోసం ఒత్తిడి తెద్దాం. 2కోట్ల ఉద్యోగాలు అయినా ఇవ్వు.. లేకపోతే ఇంటికి రూ.2వేలు నిరుద్యోగ భృతి అయినా ఇవ్వు అని నిలదీద్దాం. అవ్వా, తాతలకు రూ.1,000 నుంచి 1,500 చొప్పున పింఛన్లు ఇవ్వాలని అడుగుదాం. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేయాలని పట్టుబడదాం.  

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే..

అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతామని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మరోసారి నిరూపించింది. అందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 కూడా జతకలిసి విష ప్రచారానికి పాల్పడ్డాయి. ఉత్తరాంధ్రలో పార్టీకి ఊతమిస్తుం దని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే అమ్మను విశాఖపట్నం నుంచి పోటీ చేయించాను. కానీ అమ్మను ఓడించేందుకు టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది. ఒక పథకం ప్రకారం దుష్ర్పచారం చేసి ప్రజల మనసుల్లో విష బీజాలు నాటింది. అమ్మకు రాజకీయాలు తెలియవు. నాన్న చనిపోయిన తరువాత కేవలం నాకు తోడు గా ఉండాలనే అమ్మ రాజకీయాల్లోకి వచ్చింది. నాకు బాగా గుర్తు... అమ్మ తొలిసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గొంతు పెగల్లేదు.. అందుకే అమ్మ తన మనోధైర్యం కోసం చేతిలో చిన్న బైబిల్ పట్టుకునేది. బాధలో ఉంటే దేవుడి తోడు కోరుకోవడం సాధారణంగా అందరూ చేసేదే. కొందరు తాయెత్తు కట్టుకుంటారు. మరికొందరు దేవుడి బొమ్మతో ఉంగరాలు పెట్టుకుంటారు. మరికొందరు దేవుడి బొమ్మతో మెడలో గొలుసు వేసుకుంటారు. అది వాళ్లకు, దేవుడికి సంబంధించిన విషయం. అది పూర్తిగా వ్యక్తిగతం. కానీ దీన్ని కూడా టీడీపీ రాజకీయం చేయడం దుర్మార్గం.

తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పి కొట్టాలి

 ఇక వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ వాళ్లే కొందరు కిరాయి మనుషుల్ని ఏర్పాటు చేసి గొడవ చేయించారు. తిరిగి కడప నుంచి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందినవాళ్లు గొడవ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. ఇక నారాయణ కాలేజీ వాళ్లైతే ఏకంగా 400 మంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను ఒక్కొక్కరికి రూ.20వేలు చొప్పున ఇచ్చి నియమించారు. వీళ్లంతా వార్డుల్లోకి వెళ్లి మనకు వ్యతిరేకంగా విషప్రచారం చేశారు. బ్యాడ్ మౌత్ పబ్లిసిటీతో ప్రజల్ని తప్పుదారి పట్టించారు. వార్డుల్లో అంతో ఇంతో పట్టున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వివరాలు సేకరించి వారిని ప్రలోభ పెట్టారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ వైఫల్యం కూడా ఉంది. ఇదంతా జరుగుతోందని మనకు తెలుసు. కానీ ఆ ఏముందిలే అనే ఎవరూ స్పందించ లేదు. ఆ దుష్ర్పచారాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. దాంతో టీడీపీ చేసిన దుష్ర్పచారమే ప్రజల్లోకి వెళ్లింది. అదే ఎన్నికల్లో మనల్ని దెబ్బతీసింది. ఇకనుంచైనా ఈ విషయంలో పార్టీ విధానం మారాలి. మనపై తప్పుడు ప్రచారం చేస్తే వెంటనే తిప్పికొట్టాలి. అందుకు పార్టీ నేతలు అందరూ బాధ్యత తీసుకోవాలి.

నెలరోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం

అన్ని జిల్లాల సమీక్షలు పూర్తి చేసి నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా సంస్థాగత నిర్మాణాన్ని చేపడతాం. జిల్లా పార్టీ బాధ్యతలు యువతకు అప్పగించి వారితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం. యువత, సీనియర్ల కలబోతగా సమతూకంగా పార్టీ సంస్థాగత నిర్మాణం ఉంటుంది. నెల రోజుల్లోనే కొత్తగా అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించి, పూర్తిస్థాయి కమిటీలు వేస్తాం. మూడు నెలలకు ఓసారి జిల్లా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తాం. అందుకోసం నేను జిల్లాల్లో పర్యటిస్తాను. మీకు తోడుగా నేనుంటా.

సమీక్షా సమావేశాలకు సానుకూల స్పందన

విశాఖ నుంచి హైదరాబాద్  బయలుదేరే ముందు విలేకరులతో జగన్ మాట్లాడుతూ సమీక్షా సమావేశాలు బాగా జరిగాయన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సమావేశాల్లో పాల్గొని మంచి సలహాలు, సూచనలు ఇచ్చాయన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామని చెప్పారు. సమీక్షా సమావేశాల్లో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, సర్వేశ్వరరావు, జి. ఈశ్వరిలతోపాటు పార్టీ నేతలు ధర్మానప్రసాదరావు, పెనుమత్స సాంబశివరాజు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement