ఐక్యంగా పోరాడుదాం..రండి
దళితులు, బీసీలకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపు
రాజకీయ ముఖచిత్రం మార్చేద్దాం
బీజేపీకి అధికారం రాకుండా కట్టడి చేద్దామని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: దళితులు, వెనకబడిన తరగతులు, మైనార్టీ వర్గాల వారు కలిస్తే రాజకీయ చిత్రమే మారిపోతుందని, ఇందుకు వారంతా కలసిరావాలని మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.
కలిసి పోరాడితే రాజ్యాధికారం మనదవుతుందని, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల రాజకీయాలను శాసించే బలమైన శక్తిగా ఆవిష్కృతమవుతామని పేర్కొన్నారు. పార్టీ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయపరంగా దళితులు, బీసీలు, మైనార్టీలకు ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపించారు.
సెక్యులర్ పార్టీల మధ్య పోరు ఎన్నికల్లో మతతత్వ శక్తులకు లాభం చేకూర్చకుండా చూసుకోవాలని రాజకీయ పక్షాలకు అసదుద్దీన్ సూచించారు. మతతత్వ బీజేపీ అధికారంలోకి రాకుండా చేసి దేశాన్ని సెక్యులర్‌గా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
హైదరాబాద్ పాలన బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు తప్పదని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజన వల్ల సాధించినది ఉమ్మడి రాజధానికి గవర్నర్ పాలన మాత్రమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అండగా ఉంటామన్నారు.
కాంగ్రెస్ పార్టీ గులాంగిరీ చేసేవారిని, కారుడ్రైవర్‌నైనా గవర్నర్‌గా నియామిస్తుందని.. ఒకవేళ మోడీ ప్రధాని అయి మరొకరిని గవర్నర్‌గా నియమిస్తే.. మైనార్టీలకు రక్షణ, భద్రత ఎలా సాధ్యమవుతుందని అసద్ వ్యాఖ్యానించారు.
ఠ మజ్లిస్‌ను అంతం చేయాలనుకున్న వారికి తమతో హైదరాబాద్‌లో రాజకీయంగా తలపడేందుకు ధైర్యం చాలడం లేదని... అభ్యర్థులు కూడా దొరకడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే రాజకీయంగా అంతమైందని.. తెలుగుదేశం మైదానం ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలను పురస్కరించుకొని త్వరలో దేశవ్యాప్తంగా పర్యటించి సత్తా చాటుతామని అసదుద్దీన్ చెప్పారు.
మైనార్టీల అభివృద్ధి వైఎస్‌ఆర్ చలవే: అక్బరుద్దీన్
రాష్ట్రంలో మైనార్టీల విద్యాభివృద్ధి ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలుగుదేశం పాలనలో మైనార్టీల బడ్జెట్ రూ. 32 కోట్లను మించలేదని... ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లపైనే ఉందని ఆయన చెప్పారు. అప్పటి సీఎం వైఎస్‌ఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ, బీసీలతో సమానంగా మైనార్టీలకు ఉపకార వేతనాలు సాధించామని, ప్రస్తుతం మైనార్టీల ఉపకార వేతనాల కోసం కేటాయింపు రూ. 389 కోట్ల పైనే ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మైనార్టీ విద్యార్థుల ఉపకార వేతనాలకు కేటాయించే నిధుల కంటే.. రాష్ట్రంలో వారికి అందుతున్న ఉపకార వేతనాలు అధికమని తెలిపారు.