జాతర ఉత్సవాల్లో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
తూప్రాన్, న్యూస్‌లైన్: జాతర ఉత్సవాల్లో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఎస్‌ఐ గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. ఈ సంఘటన మండల పరిధిలోని మనోహరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మనోహరాబాద్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు మూడు రోజులుగా జరుగుతున్నాయి.
జాతర ఉత్సవాలు మంగళవారం చివరి రోజు కావడంతో టీడీపీకి చెందిన గౌడ సంఘం నాయకులు అమ్మవారికి తొట్టెల సమర్పించేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌడ సంఘం నాయకులు అమ్మవారికి తొట్టెలను సమర్పించేందుకు ర్యాలీగా వచ్చారు. ఇరుపార్టీల నాయకులు ఎదురు పడగానే పరస్పరం నినాదాలు చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. లాఠీచార్జ్ జరిపి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఓ నాయకుని ఇంటిపై రాళ్లు విసిరారు. ఈ క్రమంలో ఎస్‌ఐని కిందకు తోసేశారు. దీంతో పరిస్థితి చేయి దాటడంతో ఎస్‌ఐ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడున్న ఇరువర్గాలూ అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్పీ శెముషీ బాజ్‌పేయి గ్రామాన్ని సందర్శించారు. పరిస్థితి తెలుసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గ్రామంలో పోలీసుల బందోబస్తు నిర్వహించాలని సూచించారు. రాత్రి నుంచే జిల్లా నుంచి స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట, శివ్వంపేట, వెల్దుర్తి, జిన్నారం, హత్నూర, రామాయంపేటకు చెందిన ఎస్‌ఐలు శ్రీధర్, రాజేష్‌నాయక్, అశోక్‌రెడ్డి, పాలవెల్లి, ప్రమోద్‌కుమార్, ప్రవీణ్‌బాబు, పోలీసులు గ్రామంలో పికెటింగ్ చేపట్టారు. అయితే ఘర్షణకు కారణమైన ఇరువర్గాల నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు.