గీత + రామకృష్ణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. మున్సిపాల్టీలో తన మాటే చెల్లుబాటు కావాలనే ధోరణిలో ఎమ్మెల్యే, మున్సిపాల్టీలో ఆమె పెత్తనమేంటనే ఆలోచనలో చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తీవ్రస్థాయిలో విభేదించుకుంటున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో బుధవారం జరిగిన సమావేశమే అందుకు సాక్ష్యమని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
జరుగుతున్న పరిణామాలను తట్టుకోలేకనే అత్త మీద కోపం దుత్త మీద చూపించారన్న సామెత చందంగా ఎమ్మెల్యేపై ఉన్న కోపాన్ని 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావుపై చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ప్రదర్శించారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మధ్య తొలి నుంచి అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి.దీంతో కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు తమ వ్యవహారాలను చక్క బెట్టుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే గీత మాత్రం కాస్త వెనక్కి తగ్గారు.. మున్సిపాల్టీలో పెద్దగా జోక్యం చేసు కోలేదు.
విజయనగరం మండలమే తన నియోజకవర్గంగా పరిమితమైపోయారు. ఈ విషయాన్ని అంగీకరించేలా ఆమె బుధవారం మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో జరిగిన సమావేశంలో మీసాల వ్యాఖ్యలు చేశారు. విజయనగరం నియోజకవర్గంలో మండలం 25 శాతమేనని, మిగతా 75శాతం మున్సిపాల్టీయేనని, నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సమావేశమంతా వాడీవేడీగా సాగింది. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నీ తలపెట్టలేదు, పట్టణమంతా రెండు నెలలుగా అంధకారంలో ఉన్నా పట్టించుకోలేదు, పారిశుద్ధ్య నిర్వహణ బాగోలేదు, కొత్త పనులెందుకు ప్రారంభించలేదు ? ఎస్సీ, ఎస్టీ రుణ లబ్ధిదారుల ఎంపిక విషయమై నాకెందుకు చెప్పలేదు ? అంటూ కమిషనర్ సహా ఇతర అధికారులను గట్టిగా నిలదీశారు.
పరోక్షంగా చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ పనితీరును ప్రశ్నించినట్టు మాట్లాడారు. ఈ సమయంలో చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆమె పక్కనే దిగాలుగా, దీర్ఘాలోచనతో ఆద్యంతం కూర్చున్నారు. ‘ఇకపై ఏ పని జరిగినా చెప్పే చేయాలి., ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు.’ అంటూ అందర్ని ఉద్దేశించి ఆమె హెచ్చరించారు. అయితే, ఆకస్మికంగా ఇలా ఎమ్మెల్యే మాట్లాడడం వెనుక ఏదో వ్యూహం ఉందనే వాదన విన్పిస్తోంది. మున్సిపాల్టీలో జోక్యం చేసుకోకపోవడం వల్లే తననెవరూ గుర్తించడం లేదని, ఇలాగే వదిలేస్తే ఎమ్మెల్యేనన్న విషయాన్ని మరిచిపోతారని, ప్రసాదుల రామకృష్ణదే హవా అనే వాదన ప్రజల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే అకస్మాత్తుగా ఎమ్మెల్యే గీత సీరియస్‌గా స్పందించినట్టు తెలుస్తోంది.
అసలు కారణం ఏంటంటే..?
ఎమ్మెల్యే గీత ఒక్కసారిగా సీరియస్ అవ్వడానికి వేరే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మిమ్స్ వ్యర్థ జలాలు పట్టణానికి రక్షిత మంచినీరిందించే ట్యాంకుల్లో కలుస్తున్నా పట్టించుకోవడం లేదన్న విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు మున్సిపల్ చైర్మన్ మధ్య వివాదం నెలకొన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఎమ్మెల్యేపై చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తనదైన శైలిలో స్పందించినట్టు సమాచారం. దీంతో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే భావించి... హుటాహుటిన మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి తమ పవరేంటో తెలియజేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మొత్తానికి ఎమ్మెల్యే బుధవారం నిర్వహించిన సమావేశంతో చైర్మన్ అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. ఇదే సమయంలో ‘వీధి లైట్లు వెలగడం లేదని, పనిచేసేవాళ్లు తక్కువ, జీతాలు తీసుకున్నోళ్లు ఎక్కువని, వార్డులో పనులు జరగడం లేదని, జీతాలు బిల్లును తిరస్కరించాలని మున్సిపాల్టీలో తీర్మానం చేస్తే ఆ తర్వాత ఆమోదించేశారు.’
అని 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామరావు ప్రశ్నించగా చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కోపోద్రిక్తులయ్యారు. అటు ఎమ్మెల్యే, ఇటు అధికారుల సమక్షంలోనే ‘ నీ అంతు చూస్తానంటూ రొంగలి రామారావుపై విరుచుకుపడ్డారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను...ఎవరు అడుగుతారో చూస్తానంటూ... ఘాటుగా స్పందించారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ వ్యాఖ్యలన్నీ పరోక్షంగా ఎమ్మెల్యేనుద్దేశించి మాట్లాడారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా, తనను అంతు చూస్తానని చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారని, తనకు ప్రాణ భయం ఉందని, ఈ విషయాన్ని అశోక్ గజపతిరాజుతో పాటు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని ‘సాక్షి ప్రతినిధి’కి ఫోన్ చేసి రొంగలి రామారావు చెప్పారు.