సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం వచ్చేసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే కౌంటింగ్ ప్రక్రియ మరో 48గంటల్లో ప్రారంభం కానుంది. ఈ దఫా ఎన్నికల్లో ఈవీఎంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉండటంతో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? వీవీప్యాట్ల లెక్కింపు ఎలా చేస్తారు? ఫలితాల వెల్లడి ఎప్పుడు ఉంటుంది? అన్న వాటిపై అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతోపాటు లెక్కింపు కోసం సుమారు 25,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓట్ల లెక్కింపును 200 మంది కేంద్ర పరిశీలకులతో పాటు 200 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు పరిశీలించనున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రక్రియలో నియమ నిబంధనలు, కౌంటింగ్ జరిగే తీరు, ఫలితాల వెల్లడి తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అనంతపురం
ఉదయం నాలుగు గంటలకే కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, 4వ తరగతి ఉద్యోగులు, మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ కేంద్రాలు, వారికి కేటాయించిన నియోజకవర్గాల కేంద్రాల వద్దకు చేరుకోవాలి. 5 గంటలకు ఎవరు, ఏ టేబుల్ వద్ద కౌంటింగ్‌కు వెళ్తారో తెలుస్తుంది. 24 గంటల ముందు వారు ఏ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు చేయాలో తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణ గురించి కౌంటింగ్ హాలులోని అందరితో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ‘కౌంటింగ్ గోప్యత’పై ప్రమాణం చేయిస్తారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు వేర్వేరుగా జరుగుతుంది. ఈ కౌంటింగ్ నాలుగు విధాలుగా జరుగుతుంది.
- ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్సిమిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్)
- జనరల్ పోస్టల్ బ్యాలెట్
- ఈవీఎం/కంట్రోల్ యూనిట్స్
- వీవీప్యాట్స్
..పై నాలుగింటిలో ఒకదాని తర్వాత మరొకటి లెక్కింపు చేపడతారు.
ఏజెంట్లు గంట ముందే చేరుకోవాలి
కౌంటింగ్ కేంద్రంలో ఎన్ని టేబుళ్లు ఏర్పాటుచేస్తే ఆ టేబుళ్ల సంఖ్యకు సమానంగా పోటీచేసిన ప్రతీ అభ్యర్థి ఏజెంట్లను నియమించుకోవచ్చు. కౌంటింగ్ టేబుళ్ల చుట్టూ ఇనుప మెష్ ఉంటుంది. ఈ మెష్ అవతలే ఏజెంట్లు కూర్చోవడానికి ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటుచేస్తారు. రాజకీయ పార్టీల గుర్తింపు ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఏజెంట్లు ఆ కేటాయించిన సీట్లలోనే కూర్చోని వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏజెంటుగా నియమితులైన వారు లెక్కింపు మొదలయ్యే సమయానికి ఒక గంట ముందుగా రిటర్నింగ్ అధికారికి గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఈలోపు వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఓటింగ్ రహస్యానికి సంబంధించిన ప్రకటనపై సంతకం చేసిన తర్వాతే ఏజెంట్‌ను హాల్లోకి పంపిస్తారు. ఏజెంటు ఏ అభ్యర్థికి చెందిన వారు, ఏ సీరియల్ నెంబరు టేబుల్ వద్ద లెక్కింపు గమనిస్తారో సూచించే బ్యాడ్జీలను రిటర్నింగ్ అధికారి ఇస్తారు. ఏ టేబుల్ కేటాయించారో అక్కడే కూర్చోవాలి. హాలంతా తిరగడానికి అనుమతించరు. రిటర్నింగ్ అధికారి బల్ల దగ్గర ఉండే ఏజెంటు మిగిలిన ఏజెంట్లు లేని సమయంలో ఆ టేబుల్స్ దగ్గరకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఒకసారి లోపలికి వచ్చిన ఏజెంట్లను కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటకు పంపరు. వీరికి కావాల్సిన మంచినీరు, ఆహార పదర్థాలను అక్కడకే పంపిస్తారు.
ఈవీఎంల తరలింపు..
మే 23న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అసెంబ్లీ, పార్లమెంటు ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫాంని కేటాయిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో వీరు కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను మాత్రమే తీసుకువస్తారు. అలాగే, ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను తీసుకురావాలి.
సీళ్లన్నీ సరిగా ఉంటేనే కౌంటింగ్
సాధారణంగా కౌంటింగ్ కేంద్రాల్లో సగటున 14 టేబుళ్లు ఉంటాయి. అంటే ప్రతీ రౌండుకు సగటున 14 ఈవీఎంలు చొప్పున లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టడానికి ముందు కౌంటింగ్ ఏజెంట్లు ఈవీఎంలకు ఉన్న ముఖ్యమైన సీళ్లు అన్నీ సరిగా ఉన్నాయా లేదా.. కంట్రోల్ యూనిట్ సీరియల్ నెంబర్‌తో సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషనుకు సంబంధించిన ఫారం–17సీలో నమోదైన సమాచారం చూడాల్సి ఉంటుంది. ప్రతీ ఏజెంటు ఫారం–17సీని తప్పకుండా తీసుకెళ్లాలి. బయటి స్ట్రిప్ సీలు, ప్రత్యేక టాగ్, గ్రీన్ పేపరు సీళ్లన్నీ సరిగా ఉంటేనే ఆ మెషీనును కౌంటింగ్‌కు ఉపయోగిస్తారు. అన్నీ సరిగా ఉన్న తర్వాతే ఈవీఎం కంట్రోల్ యూనిట్ వెనుక వైపు ఉన్న స్విచ్‌ను ఆన్ చేస్తారు. ఆ తర్వాత ఫలితం వెల్లడించే బటన్‌ను నొక్కుతారు. ఈ బటన్ నొక్కగానే ఆ పోలింగ్ స్టేషనులో ప్రతీ అభ్యర్థికీ నమోదైన ఓట్లు డిస్‌ప్లే ప్యానల్ వరుస క్రమంలో చూపిస్తుంది. నోటాకు పడిన ఓట్లు కూడా చూపిస్తుంది. లెక్కింపులో మొరాయించిన ఈవీఎంలు, అభ్యంతరాలు వ్యక్తంచేసిన వాటిని పక్కకు పెట్టి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఇలా పక్కకు పెట్టిన ఈవీఎంలపై చివర్లో నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటల్లోపు ఈవీఎం లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు.
సెల్‌ఫోన్లు అనుమతించరు..
కేవలం కేంద్ర ప్రత్యేక పరిశీలకులు తప్ప మిగిలిన వారి ఫోన్లను లోపలకు అనుమతించరు. ఆర్వోల ఫోన్లను అనుమతిస్తారు కానీ వాటిని సైలెంట్ మోడ్‌లో పెట్టి పరిశీలకుని టేబుల్‌పై ఉంచాల్సి ఉంటుంది. సువిధ యాప్‌లో ఫలితాలను ప్రకటించడం కోసం ఆర్వో ఫోన్‌కు వచ్చే ఓటీపీని చూసుకోవడానికి మాత్రమే ఫోన్ వినియోగించడానికి అనుమతిస్తారు. ఈ కౌంటింగ్‌లో ఆర్వో నిర్ణయమే ఫైనల్. అందుకని ఎటువంటి వివాదాలు, అనుమానాలకు తావు లేకుండా ఒకటికి రెండుసార్లు అన్నీ పరిశీలించుకున్న తర్వాతే ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్‌కు శ్రీకారం
ఉ.8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒకవేళ అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే వాటికి సమాంతరంగా 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టవచ్చు. ఓట్ల లెక్కింపులో ఈ సారి రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో) టేబుల్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. పోస్టల్, సర్వీసు ఓట్లతో పాటు వీవీప్యాట్ లెక్కింపు కూడా ఆర్వో టేబుల్ వద్దే జరగడమే దీనికి కారణం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సర్వీసు ఓట్లతో మొదలవుతుంది. ఈవీఎంల లెక్కింపునకు ఏర్పాటు చేసిన టేబుళ్లకు అదనంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఆర్వో వద్ద ఒక ప్రత్యేక టేబుల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ తరహా పోస్టల్ బ్యాలెట్లు చెల్లవు..
- 13సీ ఎన్వలప్/బీ కవర్‌లో కాకుండా ఇతర కవరులోని బ్యాలెట్లు చెల్లవు.
- 13సీలో 13బీ లేకపోయినా, 13–సీలో 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, డిక్లరేషన్‌లో ఓటరు సంతకం, గెజిటెడ్ అధికారి అటస్టేషన్ లేకపోయినా ఓట్లు చెల్లవు.
- బ్యాలెట్‌లో మార్కింగ్ లేకపోయినా, చిరిగినా, అతుకులు వేసినా చెల్లవు
- బ్యాలెట్‌లో సంతకాలు, ఇతర రాతలు, నినాదాలు, వేలిముద్రలు ఉన్నా 13సీ ఖాళీగా పంపినా చెల్లవు..బ్యాలెట్‌లో ఎక్కువమందికి మార్కింగ్ చేసినా, ఎవరికి ఓటేశారో తెలీకపోయినా ఓటు చెల్లదు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 3 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా, దేశభద్రత కోసం వివిధ చోట్ల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది 60,250 మందికి సర్వీసు ఓట్లు జారీ చేశారు. ఈ ఓట్లన్నీ మే 23న 8 గంటల్లోగా రిటర్నింగ్ ఆఫీసరకు అందాల్సి ఉంటుంది. అంటే ఆరోజు ఉదయం 7.59 గంటలలోపు వచ్చిన పోస్టల్, సర్వీసు ఓట్లను మాత్రమే లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొత్తం ఆర్వో పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రతీ 500 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఒక ప్రత్యేకమైన టేబుల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మిగిలిన టేబుళ్ల వద్ద జరిగే వాటిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు పర్యవేక్షిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు అత్యంత కీలకం కావడంతో అన్ని విషయాలపై అవగాహన కలిగిన వారినే ఏజెంట్లుగా ఈ టేబుళ్ల దగ్గర నియమించుకోవాలని ఎన్నికల సంఘం అభ్యర్థులకు సూచిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టుకోవచ్చు. కానీ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అయితే కానీ ఈవీఎంల రౌండ్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించడానికి వీలులేదు. గతంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయితే కానీ ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టేవారు కారు. కానీ ఇప్పుడు 30 నిమిషాల తర్వాత మొదలు పెట్టడానికి అనుమతిచ్చారు.
చివర్లో వీవీప్యాట్‌ల లెక్కింపు
ఈవీఎంల ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ఆర్వో టేబుల్ వద్ద వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.
- పోలింగ్ సమయంలో ఈవీఎంల పనితీరు పరిశీలించడానికి 50 ఓట్లతో చేపట్టిన మాక్ పోలింగ్‌లో నమోదైన స్లిప్పులను వీవీప్యాట్లల నుంచి తొలగించకుండా కొన్నిచోట్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగించారు. ఇలా జరిగిన వీవీప్యాట్‌లను లాటరీ నుంచి మినహాయించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
- ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌లను లాటరీ విధానంలో ఎంపికచేసి లెక్కిస్తారు.
- ఇలా ఎంపిక చేసిన వీవీప్యాట్ల నుంచి స్లిప్పులను అభ్యర్థుల వారీగా విడదీసి 25 చొప్పున ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు.
- ఈవీఎం కంట్రోల్ యూనిట్‌లో నమోదైన ఓట్లకు.. వీవీప్యాట్లలో నమోదైన ఓట్లకు తేడా వస్తే మళ్లీ వీవీప్యాట్ల స్లిపులను లెక్కిస్తారు. అప్పుడు కూడా ఈవీఎంలతో తేడా వస్తే చివరగా వీవీప్యాట్ల నెంబర్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితంలో మార్పులు చేస్తారు.
- వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆర్వో తుది ఫలితాలను సువిధా యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అక్కడ నుంచి అనుమతి వచ్చాకే తుది ఫలితాలను ప్రకటించాలి.
Comments
Please login to add a commentAdd a comment