ఎస్పీ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందుకుంటున్న చిన్నారులు
విజయనగరం టౌన్: ఒకే దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత పోలీస్ శాఖలో పలు చోట్ల ఉద్యోగాలు చేపట్టిన వారందరూ ఏకమై ఈ ఏడాది తమ బ్యాచ్‌లో మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు వెళ్లి వారికి తామున్నామంటూ భరోసా కల్పించి ఆర్థికసాయం అందించారు. టూటౌన్‌లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కానిస్టేబుల్, విశాఖ గ్రేహౌండ్స్‌లో పని చేస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాలకు వారి బ్యాచ్‌మేట్ కానిస్టేబుళ్లు ఆసరాగా నిలిచారు. టూటౌన్‌లో పని చేసి మృతి చెందిన జి.రామారావుతో పాటు శిక్షణ పొందిన 1995 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు తమ సహోద్యోగి మృతిని జీర్ణించుకోలేకపోయారు.
తమ వంతుగా సాయమందించాలని భావించి రూ.50వేలను సేకరించి ఎస్పీ జి.పాలరాజు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వులో కానిస్టేబుల్‌గా పని చేస్తూ విశాఖ గ్రేహౌండ్స్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోయిన ఏఆర్ కానిస్టేబుల్ టి.అశోక్ కుటుంబానికి 2009 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుళ్లు తమ వంతు సాయంగా రూ.లక్షా 65వేలను అశోక్ భార్య ఉషకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. వీటిలో లక్షా 50వేలను అశోక్ పిల్లల పేరుమీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి మిగిలిన రూ.15వేలను తమ అవసరాలకు వినియోగించేందుకు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, ఏఆర్ డీఎస్పీ ఎ.హనుమంతు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ టి.త్రినాధ్, రూరల్ సీఐ దాసరి లక్ష్మణరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు బివిజె.రాజు, వైవి.శేషు, ఆర్‌ఐ శ్రీహరిరావు, బ్యాచ్‌మేట్స్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఎమ్‌విఆర్.సింహాచలం (రామా) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment