విశాఖ పట్నం జిల్లా : సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ తూఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని, అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి వాలి ఉందని తెలిపింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
రానున్న 4 రోజుల్లో విశాఖపట్టణం, కళింగపట్నం, బరువ మండలాల పరిధిలో సముద్ర తీరాన రెండు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని ఏపీ రియల్‌టైమ్ గవర్నెన్స్ తెలిపింది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రంలో వేటకి వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది.
తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జిల్లాలో కురిసిన వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి
నిలిచిపోయింది. వర్షం కారణంగా కొత్తగూడెం గనుల్లో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, మణుగూరులో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం, సత్తుపల్లిలో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. కామారెడ్డిలో రోడ్లు జలమయమై చెరువులను, వాగులను తలపిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, మాక్లూర్ నందిపేట్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కూడా భారీగా వర్షాలు పడుతుండటంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 693 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment