ఓ వైపు వాయు కాలుష్యం.. మరో వైపు కలుషిత జలం ఆ పల్లె ప్రాణాలను తీస్తోంది. శ్వాస పీల్చుకోవాలంటే క్వారీల కాలుష్యం.. దాహం తీర్చుకుందామంటే ఫ్లోరైడ్ జలమే దిక్కు. పదేళ్లగా కలుషిత నీరు వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అధికారులకు ఎన్నో దఫాలుగా మొర పెట్టుకున్నా వారి ఆవేదన అధికారుల చెవికెక్కడం లేదు.
వెంకటగిరి : జిల్లాలోని బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో దినగండం నూరేళ్ల ఆయుషుగా జీవిస్తున్నారు. ఆ గ్రామంలో దాహర్తి కోసం 10 బోర్లు ఏర్పాటు చేశారు. మరో వైపు ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉంది. అయితే గ్రామంలో భూగర్భ జలం పూర్తిగా అడుగంటి పోవడం వల్ల బోర్లలో నుంచి మంచి నీరు కాకుండా కలుషిత నీరు వస్తుంది. ఇవి తాగిన జనం రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తాగునీరు కలుషితం కారణమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లితే ఏళ్ల తరబడి పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఒకే నెలలో కిడ్నీ సమస్యలతో 12 మంది మృతి
గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది జనవరిలో 12 మంది కిడ్నీ సమస్యతో మత్యువాత పడ్డారు. ఆ కుటుంబాలన్నీ కన్నీటిసంద్రంలో మునిగిపోయాయి. నెల వ్యవధిలోనే తక్కువ వయస్సు నుంచి నడి వయస్సు వరకు ఒకే వ్యాధితో చనిపోవడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ గ్రామానికి ఇంత పెద్ద సమస్య వచ్చిందనే ఆవేదనతో ఆ గ్రామస్తులు మదనపడుతున్నారు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి అధికారులే కారణమని గ్రామస్తులు ముక్తకంఠంతో మండిపడుతోంది. గ్రామంలో ఎన్నీ బోర్లు వేసినా బోర్లలో నుంచి సురక్షిత నీరు రావడం లేదని చెబుతున్నారు.
కిడ్నీ సమస్యతో గ్రామస్తులు చనిపోతుండడం వల్ల తాము కూడా చనిపోతామన్న ఆందోళనతో బతుకుతున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో గ్రామానికి చెందిన జడపల్లి రఘురామయ్య, బద్వేలు కృష్ణారెడ్డి, అనపల్లి శ్రీమరిరెడ్డి, జడపల్లి సురేంద్ర, బండి పోలయ్య, ఆవుల నరసయ్య, వానా బాలకృష్ణయ్య, అనబాక శంకరరెడ్డి, ఉప్పు జయరామయ్య, ఉప్పు రఘురామయ్య, ఉప్పు చెంగమ్మ, వెంకటరమణలు మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన పలువురు డయాలసిస్ కోసం నెల్లూరు, తిరుపతి పట్టణాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
సుజల స్రవంతి పథకం ఏదీ
మా గ్రామంలో కలుషిత నీటి వల్ల చాలా మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. సుజల స్రవంతి ద్వారా గతంలో హామీలు ఇచ్చిన పాలకులు నేడు ఆ పథకం ద్వారా తమకు సురక్షిత నీటిని అందించలేకపోతున్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో సురక్షిత నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – జడపల్లి అపర్ణ
గుక్కెడు తాగునీరు ఇవ్వాలి
తమ గ్రామంలో మంచినీరు దొరకకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గుక్కెడు మంచినీటి కోసం ఎన్ని బోర్లు వేసిన ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఎన్నోసార్లు మంచినీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా వారు పట్టించుకోవడంలేదు. – పచ్చూరి కవిత
రెండు మినరల్ వాటర్ ప్లాంట్‌ల ఏర్పాటు
మన్నూరుతో పాటు నాయుడు కండిగ్ర చెరువు గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉండడంతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కోరాను. ఆయన స్పందించారు. త్వరలో ఆ గ్రామాల్లో వాటర్‌ప్లాంట్‌లు ప్రారంభిస్తాం. పదేళ్లుగా సమస్య ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎంపీని ఆశ్రయించాం.
– శింగంశెట్టి భాస్కర్‌రావు, ఎంపీపీ, బాలాయపల్లి
Comments
Please login to add a commentAdd a comment