కుటుంబ సభ్యుల వద్దకు చేరిన విజయ,సుప్రియ
సాక్షి, వెంకటగిరి: మండలంలోని కేజీపల్లి దళితవాడకు చెందిన వివాహితలు పీ విజయ, పీ సుప్రియ తమ ముగ్గురు చిన్నారులతో కలిసి ఈ నెల 16న అదృశ్యమైన మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారిని గురువారం రాత్రి హైదరాబాద్‌లో గుర్తించినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్‌లో వేరుగా బతికేందుకు తమ పరిచయస్తుల ద్వారా కూకట్‌పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయకాలనీకి చేరుకున్నారు. వీరిని గుర్తించి సోమవారం వెంకటగిరికి తీసుకొచ్చి ఇన్‌చార్జి తహసీల్దార్ ఆదిశేషయ్య వద్ద హాజరుపరిచినట్లు వివరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు అదృశ్యం కావడం జిల్లాలో సంచలనంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గాలింపు చర్యలను వేగవంతం చేయించారు.
స్వతహాగా బతకాలని..
అదృశ్యమైన మహిళలు పీ విజయ, సుప్రియ తోడుకోడళ్లు. వీరిలో పెద్ద కోడలు విజయకు కృష్ణయ్యతో ఏడేళ్ల క్రితం వివాహమై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి తరచూ గొడవ పడేవారు. చిన్నకోడలు సుప్రజకు కృష్ణయ్య సోదరుడు సుధాకర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. అయితే సుప్రియ వివాహానికి ముందు నెల్లూరులో నివాసం ఉండే సమయంలో ఓ వృద్ధ దంపతుల ఇంట్లో పనిచేసేది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న శ్రీదేవి (ట్రాన్స్‌జెండర్) సిద్దూ అనే పేరుతో పురుషుడి మాదిరి వస్త్రధారణ, ప్రవర్తన ఉండడంతో సుప్రియ ప్రేమించి రహస్య వివాహం చేసుకుంది. ఈ విషయం తెలిసి సుప్రియకు సైతం భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. (ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం)
దీంతో సుప్రియ తన తోడుకోడలు విజయతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి వేరుగా బతకాలని నిర్ణయించుకుని శ్రీదేవి అలియాస్ సిద్దూ సహయంతో పిల్లల ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటి నుంచి జీకేపల్లి ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే శ్రీదేవి అలియాస్ సిద్దూ గూడూరు నుంచి అద్దెకు తీసుకొచ్చిన కారులో శ్రీకాళహస్తి, అక్కడి నుంచి మరో కారులో విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో చేరుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. వీరిని తిరిగి వెంకటగిరి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. కేసును ఛేదించిన వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, డక్కిలి, వెంకటగిరి ఎస్సైలు కామినేని గోపి, వెంకటరాజేష్, అనూష, తదితరులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment