ఫ్లై ఓవర్ నిర్మించే వరకు పోరాటం
Published Mon, Dec 23 2013 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
పలాస రూరల్, న్యూస్‌లైన్: కంబిరిగాం జంక్షన్ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించేవరకు పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం అన్నారు. పలాస మండలం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కంబిరిగాం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంబిరిగాం జంక్షన్‌కు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడంతో వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని, వందలాది మంది గాయాల పాలవుతున్నారన్నారు. దీనిపై జిల్లాలోని హైవే అథారిటీ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ డెరైక్టర్‌తో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబిరిగాం జంక్షన్‌లో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను సుమారు వంద మీటర్ల వెడల్పు చొప్పున తొలగించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా వాటిని తొలగించకపోతే తామే తొలగిస్తామన్నారు. కంబిరిగాం జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు చేయాలని, సోలార్ వీధి దీపాలు వేయాలని డిమాండ్ చేశారు.
నిలిచిన వాహనాలు
ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వారితో పాటు పరిసర గ్రామాల ప్రజలు వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. పలువురు ప్రయాణికులు కూడా వారికి మద్దతు తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో లారీలు,పలు వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లై ఓవర్ నిర్మించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, వైశ్యరాజు రాజు, బమ్మిడి కృష్ణారావు, కె.పి.నాయుడు, లంబాడ మోహనరావు, పాడి సూర్యనారయణ, కె.కృష్టారావు, పాడి భీమారావు, అర్జున్, వాసు, కారువాడు, పాడి ఫల్గుణ రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement