హోదా కోసం వీధి పోరాటాలకు సిద్ధం
హోదా కోసం వీధి పోరాటాలకు సిద్ధం
Published Fri, Sep 16 2016 4:43 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
త్యాజంపూడి (దేవరపల్లి) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వీధి పోరాటాలకు సిద్ధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. దేవరపల్లి మండలం త్యాజంపూడిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ధ్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, రెండు కళ్ల సిద్ధాంతం వల్ల రాష్ట్రం నాశనమైందన్నారు. మహిళలను దారుణంగా కించపర్చే ఉపమానాలతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మోకరిల్లి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలను తమకు చెప్పుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏం సాధించారని ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పారని ఆళ్ల నాని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు నూరుశాతం నిధులు సమకూర్చుతామని చెబుతున్న కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. దశలవారీగా నిధులు ఇస్తామని చెబుతున్న కేంద్రం ఎంత ఇస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేస్తే దేవీపట్నం వద్ద రూ. 2,200 కోట్లతో ఎత్తిపోతల పథకం దేనికని ఆయన అన్నారు. నియోజకవర్గం సమన్వయకర్త తలారి వెంకట్రావు, నియోజకవర్గం పరిశీలకుడు పోల్నాటి బాబ్జి, మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందన సాయిబాలపద్మ, జిల్లా ప్రచార కమిటీ ఛైర్మన్ నూకపెయ్యి సుధీర్‌బాబు, మండల రైతు విభాగం అధ్యక్షుడు పల్లి వెంకటరత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement