బూచేపల్లి సుబ్బారెడ్డి (ఫైల్)
చీమకుర్తి/సాక్షి, అమరావతి: ప్రముఖ గ్రానైట్ పారిశ్రామికవేత్త, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (67) శనివారం ఉదయం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. కిడ్నీవ్యాధితో బాధపడుతూ గత రెండు వారాలుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించటంతో శనివారం తనువు చాలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద అభిమానంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు.
2009లో బూచేపల్లి సుబ్బారెడ్డి రాజకీయాల నుంచి వైదొలగి రాజశేఖరరెడ్డి సూచనల మేరకు రెండో కుమారుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డిని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. శివప్రసాదరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటూనే మరో పక్క గ్రానైట్ వ్యాపారంలో అందెవేసిన చెయ్యిగా ఎదిగారు. రాజకీయాలలోకి రాకముందు సుబ్బారెడ్డి చేసిన సేవాకార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆయన పార్ధివదేహాన్ని శనివారం రాత్రికి చీమకుర్తిలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు.
వైఎస్ జగన్ సంతాపం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వెలిబుచ్చారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment