=పేర్ని నాని చొరవతో కళాశాల మంజూరు
= ఆస్పత్రికి 24 గంటల విద్యుత్ సౌకర్యం
=జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా ప్రభుత్వాస్పత్రికి నూతనంగా బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ జీ సోమసుందరరావు తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 16వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నామన్నారు. కళాశాలలో 30 మంది విద్యార్థులుంటారని, అయితే ఇప్పటి వరకూ 27 మంది కౌన్సెలింగ్ ద్వారా ఎంపికయ్యారని తెలిపారు. బీ పద్మను కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం నియమించిందని ఆమె ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారని చెప్పారు.
తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ముఖ్యమంత్రిని ఈ కళాశాల ఏర్పాటు చేయాలని కోరడంతో కళాశాల మంజూరయిందని తెలిపారు. అలాగే ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యసేవలందించేందుకు తమ వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని, సరైన చికిత్స అందని రోగులు తనకు ఫిర్యాదు చేస్తే మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రసవం నిమిత్తంవచ్చిన గర్భిణిలను ఇక్కడి వైద్యులు ఎక్కువగా విజయవాడకు రిఫర్ చేస్తున్నారనే వాదనలున్నాయని విలేకరులు ప్రశ్నించగా...ఇలాంటి కేసులను ఎందుకు రిఫర్ చేయాల్సివస్తుందో ముందుగానే తనకు సమాచారం ఇవ్వాలని వైద్యులకు ఆదేశాలిస్తానన్నారు.
ఆస్పత్రిలో గత ఏఫ్రిల్ నెల నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 1916 ప్రసవాలు మాత్రమే జరగాలని టార్గెట్ ఉండగా 2884 జరిగాయని తెలిపారు. ఆస్పత్రిలో 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేందుకు గానూ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 9.50లక్షలను విద్యుత్ శాఖకు చెల్లించామన్నారు. దీంతో 7వ తేదీ నుంచి ఆస్పత్రికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సర ఫరా కనెక్షన్ ఇచ్చారన్నారు.
ఎంబీబీఎస్ పీజీ చేసిన ట్రైనీ వైద్యులు తప్పని సరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనే నిబంధన వచ్చాక, ఆస్పత్రికి ఇద్దరు నూతన వైద్యులు వచ్చారన్నారు. ఆస్పత్రిలో నాలుగు సీనియర్ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మూడు డెప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 7 అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
బీఎస్సీ నర్సింగ్ కశాళాల ప్రిన్సిపాల్ బీ పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 12 కళాశాలలను ప్రభుత్వం మంజూరు చే యగా, వీటిలో తొలి విడతగా 6 కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. రెండో విడతలో మచిలీపట్నంతో పాటు గుంటూరు, శ్రీకాకుళం, జగిత్యాల, హైదరాబాద్‌లోని గాంధీనగర్ కు ఐదు కళాశాలలను మంజూరు చేసిందని తెలిపారు. కళాశాలలో ముగ్గురు అధ్యాపకులను నియమించారన్నారు. 13, 14 తేదీల్లో అవగాహనా తరగతులను నిర్వహించి సోమవరం నుంచి తరగతులను ప్రారంభి స్తున్నామన్నారు.
16నుంచి నర్సింగ్ తరగతులు
Published Fri, Dec 13 2013 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement