
జనం గొంతుకై..
ప్రజాసమస్యలపై ‘సాక్షి’ సమరశంఖం పూరించింది.. జనం గొంతుకు మాటైంది.. వారు పడుతున్న కష్టాలు.. కడగండ్లను తీర్చేందుకు మేమున్నాం.. అంటూ సాక్షి బృందం బాసటగా నిలుస్తోంది..
=సమస్యలపై గళమెత్తిన ‘సాక్షి’
=59 సభల్లో పాల్గొన్న 6,120 మంది
=994 సమస్యల ప్రస్తావన.. 156 పరిష్కారం
=విజయవంతంగా జనసభలు
ప్రజాసమస్యలపై ‘సాక్షి’ సమరశంఖం పూరించింది.. జనం గొంతుకు మాటైంది.. వారు పడుతున్న కష్టాలు.. కడగండ్లను తీర్చేందుకు మేమున్నాం.. అంటూ సాక్షి బృందం బాసటగా నిలుస్తోంది.. జనాన్ని తట్టిలేపి.. కలంపట్టి వ్యధలు రాసి.. అధికారులను కదిలించి.. పరిష్కారం చూపి.. అందమైన రేపటికి మీరే సాక్షి అని జనసభలు చాటిచెబుతున్నాయి. అధికారులు, ప్రజలను ఒకే వేదికపైకి తెచ్చి సమస్యల సాధనలో కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి.
సాక్షి, మచిలీపట్నం : వృద్ధాప్యం మీదపడడంతో కాళ్లు పడిపోయి నడవలేని స్థితిలో ఉన్న కొత్తపల్లి వెంకన్న సత్తువ కూడదీసుకుని సాక్షి జనసభకు వచ్చాడు.. తనకు చేయూతనిచ్చి ఆదుకునేలా ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తేవాలంటూ జనం సాక్షిగా మొరపెట్టుకున్నాడు..
వికలాంగురాలైన నజీమా ఆసరా లేకపోవడంతో దుర్భర జీవనాన్ని గడుపుతోంది. జనసభ జరిగే విషయం తెలుసుకుని తెలిసినవారి సాయంతో నడిచొచ్చింది. తనకు పింఛన్ ఇప్పించేలా ప్రభుత్వ యంత్రాంగానికి విన్నవించాలని వేడుకుంది.
..ఇంకా ఇలాంటి వాళ్లెందరో తమను ఆదుకోవాలంటూ సాక్షి జనసభల్లో మొరపెట్టుకుంటున్నారు. సాక్షి బృందం చొరవతో అధికారులు కూడా చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం నాటికి 59 జనసభలు విజయవంతంగా జరిగాయి. 6,120 మంది ప్రజలు హాజరై తాము పడుతున్న బాధలను అధికారులకు వెల్లడించారు. 994 వ్యక్తిగత, సామాజిక అంశాలను అధికారుల దృష్టికి తెచ్చారు.
ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు కావాలని, పింఛన్ మంజూరు చేయాలని, రేషన్‌కార్డు ఇప్పించాలని, మంచినీటి సమస్య తీర్చాలని, వీధిలైట్లు వెలగడం లేదని, చెత్త తీయించాలని, బెల్ట్ షాపులను రద్దు చేయాలని, పేకాటలను నిలువరించాలని తదితర సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారు. వాటిని సావధానంగా ఆలకించిన అధికారులు అవకాశం ఉన్నమేరకు ఆయా సభల్లో అక్కడికక్కడే 156 సమస్యలకు పరిష్కారం చూపారు. మిగిలిన వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో జనం సాక్షిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అలా పరిష్కారం లభించిన సమస్యల్లో చెప్పుకొదగ్గవాటిని కొన్నింటిని పరిశీలిద్దాం.
మచిలీపట్నం వైఎస్సార్ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు చర్యలు తీసుకున్నారు. రత్నం హైస్కూల్ వద్ద రోడ్డుపై తవ్విన పెద్ద గొయ్యిని తక్షణం పూడ్పించారు. పడిపోయేలా ఉన్న విద్యుత్ స్తంభాలు మార్పించారు. ఒక వృద్ధురాలికి తాటాకిల్లును బాగు చేయించుకునేందుకు ‘నేనుసైతం’ స్వచ్ఛంద సేవాసంస్థ ఆర్థికసాయం అందించింది. ఈడేపల్లిలో కిందకు వేలాడుతున్న కరెంటు తీగలను అప్పటికప్పుడు సరిచేశారు. ఎస్‌ఎన్ గొల్లపాలెంలో మంచినీరులో నలకలు వస్తుంటే సమస్యను తక్షణం పరిష్కరించారు. గ్రామంలో ఒరిగిన ఎనిమిది విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవాటిని ఏర్పాటుచేసేందుకు విద్యుత్ ఏఈ హామీ ఇచ్చారు.
అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. పెడన పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ఎస్.ఐ. చర్యలు చేపట్టారు. చేనేత కార్మికుల విజ్ఞాపనతో ప్రాథమిక వైద్యాధికారి అప్పటికప్పుడు వైద్య, ఆరోగ్య శిబిరం నిర్వహించారు. కృత్తివెన్ను లక్ష్మీపాలెం సభలో ప్రజలు విజ్ఞప్తి మేరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించేందుకు ఎస్.ఐ. చర్యలు తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో ప్రజల సూచనతో పారిశుధ్య సమస్యకు మోక్షం లభించింది. కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టారు.
గుడివాడలోని బేతవోలు చిన్నపేటలో కరెంటు స్తంభాలు ఒరిగిపోవడంతో వారంలోగా వాటిని సరిచేస్తామని ఎలక్ట్రికల్ ఏఈ హామీ ఇచ్చారు. పామర్రు 19వ వార్డులో జరిగిన జనసభలో ఒక వృద్ధురాలికి ఇల్లు, మరొకరికి పింఛన్ మంజూరుకు హామీ ఇచ్చారు. అవనిగడ్డలో జరిగిన జనసభలో గుర్రపు చెరువులో పడి ఇటీవల చనిపోయిన ఇద్దరికి, పులిగడ్డలో చనిపోయిన ఒక వ్యక్తి కుటుంబాలకు అపద్బంధు పథకం కింద సాయం చేసేందుకు అధికారులు హామీ ఇచ్చారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన సభల్లో ప్రజలు ప్రస్తావించిన వీధిలైట్ల సమస్య, పింఛన్లు, డ్రైనేజీ శుభ్రం వంటి చిన్నపాటి సమస్యలను తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గన్నవరంలో మురుగు సమస్య తీరింది. ట్రాన్స్‌ఫార్మర్ రిపేరుకు చర్యలు చేపట్టారు. తిరువూరు నియోజకవర్గం కంభంపాడులో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేశారు. మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి సభలో మంచినీటి సమస్య పరిష్కారానికి, వీధిలైట్ల ఏర్పాటుకు, రోడ్ల మరమ్మతుకు హామీ ఇచ్చారు.