అమాత్యుని జాడేదీ!
నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే... అంతేకాదు ఆయన రాష్ట్ర మంత్రి కూడా. అయినా ఏం ప్రయోజనం!?... అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది భీమిలి నియోజకవర్గ ప్రజల పరిస్థితి. హుద్‌హుద్ పెను తుపాను నియోజకవర్గంపై విరుచుకుపడి నేటికి సరిగ్గా నెలరోజులు. కాని మంత్రిగారేమో ఇప్పటి వరకూ బాధితుల చెంతకే వెళ్ల లేదు. నమ్మలేకుండా ఉన్నారా!...
అయితే చదవండి...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అక్టోబరు 12న హుద్‌హుద్ తుపాను సాగరతీరంలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, తగరపువలస మండలాలతోపాటు జీవీఎంసీ పరిధిలోని మధురవాడలో జనజీవనం అతలాకుతలమైంది. భీమిలిలోని తోటవీధి, మంగమారితోట తదితర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు ముంచెత్తింది. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
బోట్లు కొట్టుకుపోయాయి. తాగేందుకు నీళ్లు లేవు. వండుకునేందుకు పాత్రలు లేవు. తినేందుకు తిండిలేదు. దాదాపు 15 రోజులపాటు విద్యుత్తు సరఫరా లేక ప్రజలు అంధకారంలో అల్లల్లాడిపోయారు. పెనుతుపాను ఇంతటి విధ్యంసాన్ని సృష్టిస్తే ఆ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కూడా అయిన గంటా శ్రీనివాసరావు నుంచి బాధితులు ఎంతో సహాయం ఆశించారు. ఆయన బాధ్యతాయుతంగా వెంటనే రంగంలోకి దిగుతారని భావించారు.
కాని వాస్తవానికి గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకూ ఒక్కసారిగా కూడా నియోజకవర్గంలోని బాధిత ప్రాంతాల్లో పర్యటించనే లేదు. బాధితులను పరామర్శించ లేదు. కూలిన ఇళ్లు చూడలేదు. మత్స్యకారులు, కూలీలు, పేదల అవస్థలు పట్టించుకోలేదు. కేవలం మొక్కుబడి సమీక్షలతో సరిపెట్టారు. ఇతర ప్రాంతాలకు చెందిన సహచర మంత్రులు, ఒకట్రెండు సంఘాలు వచ్చినప్పుడు ముక్తసరిగా పది నిమిషాలు ఉండి వెళ్లిపోయారు.
తుపాను నుంచి నేటివరకు...
అక్టోబరు 12న హుద్‌హుద్ తుపాను విశాఖపట్నం సమీపంలో తీరందాటి పెను విధ్వంసం సృష్టించింది. అప్పటి నుంచి గంటా భీమిలి నియోజకవర్గంలో పర్యటిన వివరాలిలా ఉన్నాయి...
అక్టోబరు 17: హుద్‌హుద్ తుపాను అక్టోబరు 12న విధ్వంసం సృష్టిస్తే మంత్రి గంటా అక్టోబరు 17న భీమిలి వచ్చారు. అక్టోబరు 12 తరువాత అనారోగ్య కారణంతో ఆయన మూడురోజులు విశ్రాంతి తీసుకున్నారు. అక్టోబరు 17నే ఆయన భీమిలిలోని తన క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నేరుగా విశాఖపట్నం బయలుదేరారు. దాంతో స్థానికులు కొందరు ఆయన్ను బాధిత ప్రాంతాలకు రావాలని కోరారు. తాను రాలేనని మంత్రి గంటా చెప్పారు.
కాని ఒక్కసారి వచ్చి కూలిన ఇళ్లు, రోడ్డునపడ్డ బతులకు చూడాలని వారు ప్రాథేయపడ్డారు. వారి ఒత్తిడి మీదే మంత్రి గంటా భీమిలిలోని తోటవీధి ప్రాంతానికి వచ్చారు. ఆప్రాంతం మొదట్లోనే కారు దిగి చూశారు. లోపలికి వచ్చి కూలిన ఇళ్లను చూడాలని బాధితులు కోరారు. కాని మంత్రి కేవలం పది అడుగులు వేసి అక్కడ నిలబడి రెండు నిమిషాలు పరికించి చూసి వెళ్లిపోయారు. అంతేగాని తీవ్రంగా దెబ్బతిన్న తోటవీధి ప్రాంతంలో ఆయన తిరగలేదు. ప్రజలను పలకరించనే లేదు. కూలిన ఇళ్లనుగాని ఇతర నష్టాన్నిగాని పరిశీలించకుండానే వెనుదిరిగారు.
అక్టోబరు 18: ఎంపీ హరిబాబు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావులను తీసుకువచ్చి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి గంటా ఆ సమావేశానికి హాజరై 15 నిమిషాలు పాల్గొని వెళ్లిపోయారు. బాధితుల చెంతకు మాత్రం వెళ్ల లేదు.
అక్టోబరు 19: గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రోమన్ కేథలిక్ చర్చి ప్రతినిధులు భీమిలిలోని సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ కళాశాలలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆయనతోపాటు మంత్రి గంటా కూడా బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరై వెళ్లిపోయారు. తుపాను బాధిత ప్రాంతాలకు వెళ్లలేదు.
అక్టోబరు 20: నారా లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ భీమిలిలోని మంత్రి గంటా క్యాంప్ కార్యాలయంలో బాధితులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. దీనికి మంత్రి గంటా హాజరై ఫొటోగ్రాఫర్లు ఫొటో తీయగానే వెళ్లిపోయారు.
అక్టోబరు 21: తుపాను రోజు దుర్మరణం పాలైన యర్రంశెట్టి కొండమ్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున పరిహారంగా రూ. 5లక్షల చెక్‌ను అందించేందుకు కృష్ణా కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై వెళ్లిపోయారు.