పరువు తీసేశారు : చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ‘పోస్టులు అమ్ముకుని... ఆ విషయాన్ని బయటపెట్టుకుని ప్రభుత్వం పరువు తీసేశారు. హుద్‌హుద్ తుపానుతో ఏదో మంచిపేరు వస్తుందని నేను అనుకుంటే... మీరు అది కాస్తా ఆర్డీవో పోస్టులు అమ్ముకుని దెబ్బతీశారు. పోస్టులు అమ్ముకున్నారని ఎమ్మెల్యేలే చెబితే ఇక ఏం చేయగలం. అలా ఎవరైనా బయటపెట్టుకుంటారా!... ఇక ప్రజల్లోకి ఎలా వెళ్తాం!’ అని సీఎం చంద్రబాబు తనను కలిసిన మంత్రి గంటా వర్గీయులైన ఎంపీ,ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు.
ఆర్డీవోల బదిలీల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్నల వివాదంతో పరువు బజారున పడటంతో సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆదే సమయంలో పోస్టులు అమ్ముకున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి అయ్యన్న ప్రతిపాదనకే సీఎం చంద్రబాబు మొగుగచూపినట్లు తెలుస్తోంది. సింగపూర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు శనివారం ఈ వ్యవహారంపై ఆరా తీశారు. మరోవైపు గంటా వర్గీయులైన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయన్ని శనివారం రాత్రి కలిసి తమ వాదన వినిపించారు.
ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాం
ఆర్డీవో బదిలీల వ్యవహారంలో తమ మాటా చెల్లుబాటుకాకపోవడంతో మంత్రి గంటా వర్గం నేరుగా సీఎం చంద్రబాబుతోనే తేల్చుకోవాలని భావించింది. అందుకే మంత్రి గంటా వర్గీయులైన ఎంపీ అవంతీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బండారు సత్యన్నారాయణమూర్తి, పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, కెఎస్‌ఎన్‌ఎస్‌రాజు, అనితలు శనివారం రాత్రి చంద్రబాబును కలిశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్ పోస్టులను అమ్ముకున్నారని ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే వెలగపూడి వైఖరి వల్ల పార్టీ పరువు బజారున పడిందన్నారు.
ఈ పరిస్థితుల్లో జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్తామని ఎమ్మెల్యే బండారు సత్యాన్నారాయణమూర్తి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వీరి వాదనను ఆసాంతం విన్న చంద్రబాబు అదే స్థాయిలో స్పందించారు. పోస్టులు అమ్ముకున్న విషయాన్ని మనమే బయటపెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ‘హుద్‌హుద్ తుపానుతో ఏదో చేసి మంచిపేరు తెచ్చుకుందామని నేను ప్రయత్నిస్తుంటే మీరు అంతా పాడు చేశారు. ప్రభుత్వం పరువు తీసేసి బజారున పడేశారు’అని సీఎం తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఇక జిల్లాలో ప్రజలకు మొహం ఎలా చూపించాలని కూడా ఆగ్రహంగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. గంటా వర్గం మాత్రం అయ్యన్య వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ తమ వాదనను వినిపించి వచ్చింది.
అయ్యన్నదే పైచేయి...గంటాకు ఝలక్!
ఆర్డీవోల బదిలీల వ్యవహారంలో మంత్రి అయ్యన్నవైపే చంద్రబాబు మొగ్గుచూపారు. ఆయన శనివారం రెవెన్యూ మంత్రి కేవీ కష్ణమూర్తితో చర్చించడమే కాకుండా తన ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్రను వివరణ కోరారు. కేఈ కృష్ణమూర్తి కూడా మంత్రి అయ్యన్నను సమర్థించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర అన్ని విషయాలను సీఎంకు వివరించారు. చంద్రబాబు చివరికి అయ్యన్న వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. ఆయన సూచించినట్లుగా ఆర్డీవోగా వై.రామచంద్రారెడ్డి బదిలీని ఖరారు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈమేరకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పారు. విశాఖపట్నం ప్రసుత ఆర్డీవో వెంకట మురళిని రెండ్రోజుల్లో విధుల నుంచి రిలీవ్ చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామాలతో గంటా వర్గానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా వ్యవహారాల్లో గంటా మాటకంటే అయ్యన్నమాటకే ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని కూడా చెబుతున్నాయి.