జీజీహెచ్‌కు సమైక్య సెగ
Published Sun, Aug 25 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
సాక్షి, కాకినాడ :సమైక్య సమ్మె ప్రభావం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో స్పష్టంగా కనిపిస్తోంది. సేవలు అందించడానికి వైద్యులతోపాటు స్టాఫ్ నర్సులు, ఆయాలు, ఇతర వార్డు సిబ్బంది అందుబాటులో ఉన్నా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి ఈ ఆస్పత్రికి రోజూ సగటున 3వేల మంది ఔట్ పేషెంట్లు వస్తారు. 1,500 మంది ఇన్ పేషెంట్లుగా ఉంటారు. సమైక్య సమ్మె ప్రారంభ మైన జూలై 31 నాటికి ఔట్ పేషెంట్ల సంఖ్య 2,475, ఇన్ పేషెంట్లుగా 1,226 మంది ఆస్పత్రిలో ఉన్నారు. అదేరోజు ఇన్ పేషెం ట్లుగా కొత్తగా 187 మంది చేరారు. ఈ నెల 23న ఔట్ పేషెంట్ల సంఖ్య చూస్తే 1,470 మా త్రమే ఉంది. తాజా లెక్కల ప్రకారం 1,030 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. ఈ తగ్గుదల రోజుకో రీతిలో కొనసాగుతోంది. 1,065 పడకల ఈ బోధనాస్పత్రి చాలా భాగం ఖాళీ బెడ్‌లతో దర్శనమిస్తోంది.
నిలిచిన రవాణా
సమ్మె నేపథ్యంలో బస్సులు నిలిచిపోవడం, అంతంత మాత్రంగా ఆటో వంటి వాహనాలు తిరుగుతున్నా అధిక టికెట్ ధర డిమాండ్ చేస్తున్న కారణంగా గ్రామాల నుంచి పేద రోగు లు జీజీహెచ్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది. అన్నిటికీ మించి ప్రతిరోజూ గైనిక్ వార్డులో ముప్పై అయిదు మందికి పురుళ్లు పోస్తారు. ఇందులో సాధారణ పురుళ్లు ముప్పై ఉండేవి. సిజేరియన్ ఆపరేషన్లు చేసి కొంతమందికి పురుళ్లు పోసేవారు. ఆస్పత్రి మొత్తంలో సహ జ, అసహజ మరణాలు దాదాపుగా రోజుకు పదమూడు వరకూ ఉంటాయని అధికారిక అంచనా. ఆస్పత్రిలో జనన, మరణాల నమోదుకు సక్రమంగా రికార్డు నిర్వహించి మునిసిపల్ అధికారులకు క్రమం తప్పకుండా వాటిని పంపాలి.
ఎలాంటి అవాంతరాలున్నా జనన, మరణాల వివరాలను 21 రోజుల లోపు పంపి తీరాలి. ఆస్పత్రి పరిపాలనా సిబ్బంది, పురపాలక సిబ్బంది 25 రోజులుగా సమ్మెలో ఉండడంతో జనన, మరణాల నమోదు ప్రక్రియ అటకెక్కింది. ఎంఎల్‌సీ (మెడికో లీగల్) కేసు ల్లో గాయాల సర్టిఫికెట్లు, ప్రమాద మరణాల్లో పోస్టుమార్టం సర్టిఫికెట్లు న్యాయస్థానాలకు ఆస్పత్రి నుంచి అందివ్వాల్సి ఉంది. ఇవి కూడా ఆస్పత్రి పాలనా సిబ్బందితో పాటు న్యాయస్థానాల ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున ైఫైళ్లు కదలక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
ఔను నిజమే : డాక్టర్ బుద్ధ
సమైక్య సమ్మె ప్రభావంతో రోగుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడమే అందుకు సాక్ష్యమని శనివారం జీజీహెచ్ సూపరింటెండెంటు డాక్టర్ బుద్ధ చెప్పారు.పాలనా పరమైన వ్యవహారాలు కూడా కుంటుపడ్డాయని ఆయన అన్నారు. ప్రాణ ర క్షణ మందులు కొరత లేదని అవసరమైతే కొనుగోలుకు ఆరోగ్య శ్రీ నిధులు వినియోగించుకుంటామన్నారు.
Advertisement
Advertisement