= టీచర్ల 50రోజుల సమ్మెలో 33 పనిదినాలు
= వీటి భర్తీకి ప్రత్యేక టైమ్‌టేబుల్
= జీవో విడుదలలో సాంకేతిక ఇబ్బందులు?
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొన్న అనంతరం గురువారం నుంచి ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో బడిబాట పట్టనున్నారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో జరిగిన సమావేశంలో సమ్మె విరమిస్తున్నట్టు ఉపాధ్యాయులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు మొత్తం 50 రోజులు సమ్మె చే శారు. అందులో సెలవులుపోను 33 రోజుల్ని పనిదినాలుగా గుర్తించారు.
ఈ మొత్తం రోజులకు వేతనం ఇచ్చే అంశంపై పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, ఉపాధ్యాయ సంఘం నాయకుల మధ్య మంగళవారం రాత్రి చర్చలు జరిగాయి. ఈ 33 పనిదినాలను మార్చి 9వ తేదీలోగా తరగతులు పెట్టి భర్తీచేస్తామని విద్యాశాఖాధికారులకు ఇచ్చిన లేఖలో ఉపాధ్యాయ నేతలు స్పష్టంచేశారు. దీనిపై ఇరువర్గాలవారు సంతకాలు చేశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు ఇచ్చిన లేఖలోని అంశాలతో ప్రభుత్వం సంతృప్తి చెందితే సమ్మెచేసిన కాలానికి వేతనం విడుదల చేసేందుకు ప్రత్యేక జీవో ఇవ్వాల్సి ఉంది.
మరో 10 రోజుల వ్యవధిలో జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి కన్వీనరు మత్తి కమలాకరరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సమ్మెచేసిన ఉపాధ్యాయులకు 151 జీవో ప్రకారం వేతనాలు విడుదల చేశారని తెలిపారు. సమ్మె కాలంలో కోల్పోయిన పనిదినాలను భర్తీచేస్తామని తెలంగాణ టీచర్లు ఒప్పందం కుదుర్చుకోవడంతో అప్పట్లో ప్రభుత్వం వారికి వేతనాలు విడుదల చేసింది. ఇదే పద్ధతిని సీమాంధ్ర ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.
సీఎం హామీతోనే సమ్మె విర మణ
ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో ఈ 33 పనిదినాలకు వేతనం ఇస్తామని ఆయన హామీ ఇచ్చినందునే తాము సమ్మె విరమించినట్లు కమలాకరరావు పేర్కొన్నారు. 2014 మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు మొదలవుతాయని, ఆలోగా ఈ పనిదినాలను భర్తీ చేసేలా ఓ టైమ్‌టేబుల్ రూపొందించి విద్యాశాఖాధికారులకు అందజేశామన్నారు. అదనపు తరగతులు నిర్వహిస్తే తాము హాజరుకాబోమని సమ్మెలో పాల్గొనని సంఘాల ఉపాధ్యాయులు, నాయకులు తేల్చిచెప్పినట్లు ఆయన చెప్పారు.
దీనిపై కూడా కొంత గందరగోళం నెలకొందన్నారు. అయితే సాంకేతికపరమైన ఇబ్బందుల దృష్ట్యా జీవో విడుదలలో కొంత జాప్యం జరిగినా.. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు వేతనాల విడుదల విషయంలో అనుమానాలకు తావులేదని ఆయన చెప్పారు. కాగా, సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు వేతనాల విడుదల, నష్టపోయిన పనిదినాల భర్తీ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని డీఈవో డి.దేవానందరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
జీవో అమలుచేయాలి
సమైక్య సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు వేతనాలు మంజూరుచేయాలని ప్రభుత్వం గత నెల 27న విడుదల చేసిన జీవోను అమలుచేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ఏదైనా విభాగంలో డ్రాయింగ్ ఆఫీసర్‌గా ఉన్న అధికారి సమ్మెలో ఉంటే ఆయన తరువాత సీనియర్‌గా ఉన్న ఉద్యోగి ఆ బాధ్యత స్వీకరించి జీతాల బిల్లు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం జీవో విడుదలైనా అమలుకు నోచుకోలేదని సమ్మె చేయని ఉద్యోగులు వాపోతున్నారు. విజయవాడ రూరల్ మండలానికి సంబంధించి ఉన్నత పాఠశాలలు మినహా మిగిలిన అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమ్మెకు దూరంగా ఉన్నారు. వీరికి కూడా వేతనాలు అందని పరిస్థితి నెలకొంది.