- ఐదుగురి జీతాల నిలిపివేత
- విధులకు డుమ్మా కొట్టినట్టు ఆకస్మిక తనిఖీలో నిర్ధారణ
- తదుపరి చర్యలపై పీవోకు సిఫారసు
కొయ్యూరు: యూ.చీడిపాలెం పంచాయతీ పలకజీడి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయుల జీతాన్ని నిలిపివేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు రాకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపడం మానేశారన్నారు. మండల కేంద్రానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలను శుక్రవారం డీడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పటికి ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ముగ్గురే ఉన్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు ఉపాధ్యాయులు నెలలో ఒక్కసారి కూడా రావడం లేదని గ్రామస్తులు తెలిపారన్నారు. కొయ్యూరుకు చెందిన అశోక్‌కుమార్,పాపారావులు సక్రమంగా రావడం లేదన్నారు. వారి బాటలోనే లమ్మసింగి సింహాచలం,హింది పండిట్ భాస్కరరావు,పీఈటీ సీహెచ్ చంద్రపడాల్‌లు డుమ్మా కొడుతున్నారన్నారు.
దీంతో ప్రస్తుతం 162 మంది విద్యార్థులకు 21 మందే ఉన్నారన్నారు. గ్రామస్తుల మాటలను వీడియో చిత్రీకరించారు. వాటిని విలేకరులకు చూపారు. ఈ వీడియోను పీవోకు అందజేస్తామన్నారు. పీవో ఆదేశం మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు. అంతకు ముందు మండల కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఠం బీమవరం పాఠశాలను సందర్శించారు.