610 ఉద్యోగుల స్థానికతకు జీవోనే ప్రామాణికం! | GO Standard only for 610 Local employees | Sakshi
Sakshi News home page

610 ఉద్యోగుల స్థానికతకు జీవోనే ప్రామాణికం!

Published Fri, Apr 11 2014 4:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

610 ఉద్యోగుల స్థానికతకు జీవోనే ప్రామాణికం! - Sakshi

610 ఉద్యోగుల స్థానికతకు జీవోనే ప్రామాణికం!

* 4 నుంచి 10వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికత
* గవర్నర్‌తో కమలనాథన్
* కమిటీ భేటీ.. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ హాజరు
* నేడు ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు.. కేంద్రానికి నివేదిక

 
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీలో స్థానికతకు 610 జీవోను ప్రామాణికంగా తీసుకోవాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఈ జీవో ప్రకారం 4వ తరగ తి నుంచి 10వ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అదే స్థానికతగా పరిగణిస్తారు. కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటివారంలో అధికారికంగా విడుదల చేయనుంది. కమలనాథన్ కమిటీ గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నర్సింహన్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో విభజనకు సంబంధించి కేంద్ర మంత్రివర్గ ఉప కమిటీలో సభ్యుడైన మంత్రి జైరాం రమేశ్, సీఎస్ మహంతి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
 
 ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు, ఎన్నికల ముందు ఉద్యోగుల పంపిణీకి అనుసరించే విధానాన్ని ప్రకటిస్తే ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందా అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాలతో ఎటువంటి వివాదాలు తెచ్చుకోకూడదనే అభిప్రాయంతో కమలనాథన్ ఉన్నారు. మార్గదర్శకాలు కూడా ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టులను జిల్లాల నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి పంపిణీ చేస్తారు.
 
 ఇదంతా తాత్కాలికంగానే (ప్రొవిజనల్) జరగాలని, ఉద్యోగుల తుది పంపిణీ అనేది ఎన్నికల అనంతరం ఎన్నికైన రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకనే చేయాలనేది కమలనాథన్ అభిప్రాయమని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మరోపక్క మార్గదర్శకాల ముసాయిదాను ఖరారు చేసేందుకు శుక్రవారం కమలనాథన్ కమిటీ సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చన వర్మ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ ముసాయిదా మార్గదర్శకాలు న్యాయపరంగా, చట్టబద్ధంగా ఉన్నాయో లేవో కేంద్రం పరిశీలించనుంది. ఆ తర్వాత వాటిని వచ్చే నెల మొదటివారంలో అధికారికంగా విడుదల చేస్తుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement