శ్రీవారి పట్టపురాణి
తిరుచానూరు: కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం రాత్రి పద్మావతీ అమ్మవారు అశ్వవాహనంపై కల్కి అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7.05 గంటలకు అమ్మవారికి వేడుకగా రథోత్సవం, మధ్యాహ్నం ఒంటి గం టకు రథమండపంలో నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించారు. తరువాత అమ్మవారిని వాహన మండపానికి తీసుకొచ్చి అశ్వవాహనంపై కొలువుదీర్చారు.
పట్టుపీతాంబర వజ్రవైడూర్య ఆభరణాలతో అమ్మవారిని కల్కి భగవానుడిగా అలంకరిం చారు. రాత్రి ఎనిమిది గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ ప్రవచనం, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారు అశ్వవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. వాహనసేవలో టీటీడీ ఈవో ఎంజీ. గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, వీజీవో రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.