కుదవ బంగారం జరభద్రం
రేటు తగ్గిన ఎఫెక్ట్
- ఆక్షన్ వేస్తామంటూ నోటీసులు
- బంగారంపై తగ్గిన రుణసాయం
- లబోదిబోమంటున్న రైతన్నలు
సాక్షి, విజయవాడ : పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు తమ అవసరాల కోసం తమ వద్ద ఉన్న బంగారం బ్యాంకుల్లోనూ, ఫైనాన్స్ సంస్థల్లోనూ తాకట్టుపెట్టి రుణాలు తీసుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని నెలలుగా బంగారం రేట్లు తగ్గిపోతూ ఉండటంతో బ్యాంకుల్లోనూ, ప్రైవేటు సంస్థల వద్ద కుదవ పెట్టిన బంగారం ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. కుదవ పెట్టిన బంగారానికి వడ్డీతో సహ అప్పు చెల్లించాలని లేకపోతే ఆక్షన్ వేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. బంగారం పోతుందేమోననే ఆందోళనలో కొత్త అప్పులు చేసి బంగారానికి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
తగ్గుతున్న బంగారం ధరలు..
గత ఆరు నెలల కాలంతో పోల్చితేనే బంగారం ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల బంగారం 26,250 ఉండగా ప్రస్తుతం 23,400 మాత్రమే ఉంది. బంగారం ధరలు తగ్గటంతో బంగారంపై ఇచ్చే రుణాలను బ్యాంకులు తగ్గించేశాయి. కమర్షియల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు బంగారం ధరలో(తరుగు తగ్గించి) 70 శాతం వరకు రుణం ఇస్తాయి.
ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు తరుగులు తగ్గించకుండా 75 శాతం వరకు రుణాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు గ్రాముకు సుమారుగా రూ.3 వేల వరకు తగ్గడంతో బ్యాంకులు రుణం సాయం తగ్గించేశాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులకు వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాల్సి వస్తోంది.
రైతుల పరిస్థితి మరీ దారుణం
కృష్ణాజిల్లాలో గత ఏడాది రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రూ.2,203 కోట్ల రుణాలు తీసుకోగా అందులో 1,219.43 కోట్లు బంగారం కుదవ పెట్టి తీసుకున్నవే. వ్యవసాయ రుణాలతో సాగుకు సరిపోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో బంగారాలను కుదవ పెట్టి రుణాలు తీసుకున్నారు. గతంలో బ్యాంకర్లు వ్యవసాయ భూమి తక్కువగా ఉన్నప్పటికీ రైతులపై నమ్మకంతో ఎక్కువ రుణం ఇచ్చేవారు. ప్రస్తుతం చంద్రబాబు రుణమాఫీ పేరుతో బ్యాంకులు ఇస్తున్న రుణాలను పరిశీలించడం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి నిబంధనల అమలుతో బ్యాంకర్లు రైతులకు భూమికి ఇచ్చే రుణం కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బంగారం కుదవపెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు రుణమాఫీలో తమ రుణం మాఫీ అవుతుందని అనేక మంది రైతన్నలు బంగారం రుణాలు, వ్యవసాయ రుణాలు తిరిగి చెల్లించలేదు. ఇప్పుడు అసలు, వడ్డీతో సహ కలిపి తడిసి మోపుడయ్యాయి. ఈ రెండు రుణాలు చెల్లిస్తేనే తిరిగి రుణం ఇస్తామంటూ బ్యాంక ర్లు ముడిపెడుతూ ఉండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రుణమాఫీ వర్తించని రైతులు మూడవ విడత లిస్టులోనైనా తమ పేరు ఉంటుందని ఆశతో బంగారు రుణాలు చెల్లిం చడం లేదు. ఖరీఫ్ ఆశాజనకంగా లేకపోవడంతో, బంగా రం ధర తగ్గిపోతూ ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకర్లు గతంలోని రుణాలను పునరుద్ధరిస్తున్నామని, కొత్త రుణాలు ఇవ్వలేమంటూ రైతులను పంపివేస్తున్నారు.
సత్యనారాయణపురానికి చెందిన కృష్ణారావు ఒక ప్రైవేటు సంస్థలో ఆరు కాసుల బంగారం తాకట్టు పెట్టి ఏడాది క్రితం లక్షల రుణం తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీతో సహా అప్పు తీర్చాలని లేకపోతే బంగారం వేలం వేస్తామంటూ ప్రైవేటు కంపెనీ నుంచి నోటీసు వచ్చింది.
రంగారావు కంకిపాడులో సన్నకారు రైతు. వ్యవసాయం కోసం సహకార బ్యాంకులో గతంలో బ్యాంకులో మూడు కాసుల బంగారం గొలుసు తాకట్టు పెట్టి రూ.45,000 రుణం తీసుకుని రుణం తీర్చేశాడు. ప్రస్తుతం వ్యవసాయ అవసరాల కోసం తిరిగి అదే తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుందామని వెళ్లితే రూ.35 వేలు మించి ఇవ్వమనడంతో అవాక్కయ్యాడు.
రంగయ్య గుడ్లవల్లేరులో రైతు. ఏడాదిన్నర క్రితం 10 కాసుల బంగారం కమర్షియల్ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.లక్షా 60 వేల రుణం తీసుకున్నాడు. చంద్రబాబు రుణమాఫీ ప్రకటించడంతో బంగారంపై బకాయి తీరిపోతుందని ఆశించాడు. తొలి రెండు విడత లిస్టులో నూ బకాయి రద్దు కాలేదు. బంగారం, భూమి కాగి తాలు పెట్టనందున రుణం మాఫీ కాదని, అసలు, వడ్డీ కలిపి రూ.70 వేల వరకు రుణం చెల్లించాలంటూ నోటీసు రావడంతో రంగయ్య లబోదిబోమంటున్నాడు.