సాక్షి, అమరావతి : ఓవైపు కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే, మరోవైపు డెంగీపైనా అప్రమత్తమైంది. గతేడాది నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పటిష్ట నియంత్రణకు చర్యలు చేపట్టింది. మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్స్ (ఎంఎండీసీ)ను ఇప్పటికే రంగంలోకి దించింది. తొలకరి జల్లులు పడగానే డెంగీ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 14 సెంటినల్ సర్వ్‌లెన్స్ హాస్పిటల్స్ (ఎస్‌ఎస్‌హెచ్‌లు) దీనికోసం ముమ్మరంగా పనిచేస్తున్నాయి.
సర్కారు తాజా చర్యలు ఇవే..
ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం
►కార్పొరేషన్ల పరిధిలో ఎంఎండీసీల ఏర్పాటు. యాంటీ లార్వల్ చర్యలు
►ఫీవర్ స్క్రీనింగ్ చర్యలకు ఏర్పాట్లు
►పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రూరల్ డెవలప్‌మెంట్, హెల్త్ విభాగాల సమన్వయానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ
►డెంగీని నిర్ధారించే ఎలీశా టెస్టుల సంఖ్యను భారీగా పెంచడం
►ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్‌ను వేరు చేసే యంత్రాల ఏర్పాటు
చికిత్సకు మార్గదర్శకాలు
►డెంగీ జ్వరాన్ని ఎలీశా టెస్టు ద్వారా నిర్ధారిస్తారు. ఫిజీషియన్ సూచనల మేరకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి
►యాంటీవైరల్ ఇంజక్షన్లు, జ్వర తీవ్రతను తగ్గించేందుకు పారాసెటిమాల్ ఇవ్వాలి
►రోగికి పళ్లు, పళ్ల రసాలు ఆహారంగా ఇవ్వాలి. పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి
►రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీరు తాగించాలి
ప్రజలకు సూచనలు
►ఇంటి ఆవరణంలో కొబ్బరి చిప్పలు, టైర్లు వంటి వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
►సెప్టిక్ ట్యాంకులు తదితర వాటికి నైలాన్ దారంతో కూడిన మెష్‌లు కట్టుకోవాలి. రాత్రిపూట వీలైనంత వరకూ దోమతెరలు వాడాలి
►ఇంటి ఆవరణాన్ని పొడిగా ఉంచాలి.
డెంగీ లక్షణాలు
►డెంగీ జ్వరం ఈడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది.
►దోమ కుట్టిన 24 గంటల్లోనే విపరీతమైన తలనొప్పి వస్తుంది. జ్వర తీవ్రత పెరిగే కొద్దీ కళ్లు ఎర్రగా మారుతుంటాయి
►మరుసటి రోజు కండరాల నొప్పి, అనంతరం మోకాళ్లు, ప్రతి కీలు వద్దా నొప్పి తీవ్రత
►ఒళ్లంతా దద్దుర్లలా మొదలై, ఎర్రగా మారతాయి
►ఆహారం తీసుకోవాలనిపించదు, తీసుకున్నా వాంతులవుతాయి
►డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్‌ఎఫ్) అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు ఇక చివరి దశను డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్‌ఎస్) అంటారు.
Comments
Please login to add a commentAdd a comment