దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ప్రథమ పౌరులు ముందడుగు వేశారు.
* వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ల పోరు
* పార్టీ శ్రేణుల ఆందోళనలతో దద్దరిల్లిన సీమాంధ్ర
సాక్షి నెట్‌వర్క్: దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ప్రథమ పౌరులు ముందడుగు వేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో గత నెల 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి సమగ్ర కార్యాచరణతో ఉద్యమిస్తున్న వైఎస్సార్‌సీపీ శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సం నాడు విభజనను వ్యతిరేకిస్తూ వేలాది గ్రామసభల్లో ఏకగ్రీవతీర్మానాలు చేయించింది. పార్టీ పిలుపుమేరకు వేలాదిమంది సర్పంచ్‌లు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ ఆయా పంచాయతీల గ్రామసభల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాలను రాష్ట్రపతి, ప్రధానమంత్రిలకు పంపనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
విశాఖ జిల్లావ్యాప్తంగా 335 గ్రామసభల్లో సమైక్యరాష్ట్రం కోరుతూ తీర్మానం చేయగా, శ్రీకాకుళం జిల్లాలో 367 గ్రామసభల్లో, విజయనగరం జిల్లాలో 218 గ్రామసభల్లో ఆ మేరకు తీర్మానం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 254 గ్రామసభల్లోనూ, వైఎస్సార్ జిల్లాలో 391, అనంతపురంలో 314, నెల్లూరు జిల్లాలోని 244 గ్రామసభల్లో సమైక్య తీర్మానాలు చేశారు. కర్నూలు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ వందలాది గ్రామాల్లో సర్పంచ్‌లు సభలు నిర్వహించి రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ తీర్మానాలు చేశారు. సమైక్య రాష్ట్రం కోరుతూ పార్టీకి చెందిన విశాఖ జిల్లా జామిగుడ, గిన్నెలకోట సర్పంచ్‌లు కుమడ సుబ్బారావు, లకే దేవకుమారిలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేసి పత్రాలను జిల్లా అధికారులకు అందజేశారు.
విభజన కారకుల దిష్టిబొమ్మల దహనం
నరక చతుర్దశిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి వైఎస్సార్ సీపీ శ్రేణులు సీమాంధ్ర జిల్లాల్లో విభజన రాక్షస సంహార కార్యక్రమాన్ని చేపట్టాయి. రాజమండ్రి, జగ్గంపేటలలో సోనియా, కేసీఆర్, కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలను విభజన నరకాసురులిగా కూర్చి దహనం చేశారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గణపవరం, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం ప్రాంతాల్లోనూ వీరి దిష్టిబొమ్మలను దహనం చేశారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, జామి, ఎస్‌కోట ప్రాంతాల్లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కర్నూలు, డోన్‌లలో, వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేట, కడపల్లో విభజన నరకాసుర వధ పేరిట దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు.
విజయమ్మను అడ్డుకోవడంపై ఆగ్రహజ్వాలలు
నల్లగొండలో వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గుమ్మంపాడు సర్పంచ్ పెన్మత్స రామరాజు 24 గంటల నిరాహార దీక్షను చేపట్టారు.
వాడవాడలా హోరెత్తిన నిరసనలు
రాష్ర్ట విభజన జరిగితే విద్యార్థులు గొర్రెలు మేపి బతకాల్సి వస్తుందన్న సందేశంతో తిరుపతి నగర పరిధిలోని తిమ్మినాయుడుపాలెంలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కాన్వొకేషన్ కోటు ధరించి, డిగ్రీ పట్టా నమూనాలను గొర్రెలకు తినిపించి నిరసన వ్యక్తం చేశారు. విభజన జరిగితే హైదరాబాద్‌కు పాస్‌పోర్టు తప్పదన్న సందేశంతో వైఎస్సార్ సీపీ చంద్రగిరి నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చౌక్ వద్ద రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పార్టీ నేతలు క్షీరాభిషేకాలు చేశారు. గుంటూరు నగరంలో పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు మానవ హారం నిర్వహించారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులలో పార్టీ ఆధ్వర్యంలో 10 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించారు. పూల అంగళ్ళ కూడలిలో తెలుగు తల్లికి రాష్ట్ర విభజన సెగ తగలకూడదంటూ 101 బూడిద గుమ్మడికాయలతో మహిళలు దిష్టి తీశారు. ఇక అక్టోబర్ 2 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గకేంద్రాల్లో పార్టీశ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి.