జిల్లా వ్యాప్తంగా మంగళవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు.
అనంతపురం కల్చరల్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. మసీదులు, దర్గాలు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతపురం హౌసింగ్‌బోర్డులోనిఈద్గా మైదానం జనసంద్రమైంది. మైనార్టీ సంక్షేమ, సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ మదమంచి స్వరూప, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరై.. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నగర ఖాజీ ఇమామ్ షరీఫ్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం దివ్య సందేశాన్నిచ్చారు. ముతవల్లి కె.ఎం.షఫీవుల్లా, వివిధ మసీదుల ఇమామ్‌లు రంజాన్ విశిష్టతను వివరించారు.
హెచ్చెల్సీ కాలనీలోని బాహువుద్దీన్ మసీదు ప్రాంగణంలో గల ఈద్గా మైదానంలో పేష్ ఇమామ్ జమీరుల్ సందేశం వినిపించారు. పెద్దలు, గురువుల పట్ల వినయ విధేయతలు, మత సామరస్యం, సోదర భావం ప్రతి ముస్లిం అలవర్చుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం దేశమంతటికీ సకల శుభాలు కలగజేయాలని ఆకాంక్షించారు. అనంతరం పక్కనే ఉన్న ఖబరస్థాన్‌లో సమాధుల వద్ద పెద్దల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. మత సామరస్యాన్ని చాటుతూ ఇచ్చిన విందుల్లో ముస్లింలతో పాటు పలువురు హిందువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బహువుద్దీన్ మసీదు ముతవల్లి ఫరీదుద్దీన్, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నాయకులు మక్బుల్, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.