చిన్నారి గొంతు నులిమి దోపిడీ
రూ. లక్ష నగదు, 30 తులాల బంగారం అపహరణ... ఓటేసేందుకు వెళ్తే ఇల్లు దోచేశారు
తల్లిదండ్రులు ఓటు వేసేందుకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న పిల్లలను బెదిరించి రూ. లక్ష నగదుతోపాటు, 30 తులాల బంగారాన్ని దోచేశారు. స్థానిక శాంతినగర్ గౌరవ్ గార్డెన్స్ సమీపంలోని ఓ ఇంట్లో కాంట్రాక్టర్ రఘునాథరెడ్డి, సుజాత దంపతులు నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తమ పిల్లలు లహరి (12), జస్వంత్ (7)లను ఇంట్లో వదిలి, ఓటు వేసేందుకు సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కొద్దిసేపటికి ఎవరో తలుపు తట్టడంతో వచ్చింది ఎవరంటూ లహరి ఆరా తీసింది.
‘ఏసీ రిపేర్ చేయడానికి వచ్చానని.. మమ్మీ, డాడీ ఓటు వేసేందుకు వెళుతూ ఎదురు వచ్చారని, తలుపులు తీయాలని అతను కోరాడు. దీంతో ఆ చిన్నారి తండ్రికి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే తలుపులు తీసి బయటకు వచ్చింది. బయటే వేచి ఉన్న అగంతకుడు అమె గొంతు పట్టుకుని నులుముతూ లోపలి గదిలోకి తీసుకెళ్లి బెదిరించడంతో, ఆమె తమ్ముడు జస్వంత్ బీరువా తాళాలు ఇచ్చేశాడు. బీరువా తెరిచి.. 30 తులాల బంగారు నగలు, రూ. లక్ష నగదు తీసుకుని దుండగుడు ఉడాయించాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని సమాచారం అందించడంతో త్రీటౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంతకు ముందు ఎప్పుడూ అతడిని చూడలేదని చిన్నారి చెబుతోంది.