గ్రూప్ 2 కీ విడుదల
ప్రశ్నల వారీ ‘కీ’లను వెబ్‌సైట్లో పొందుపర్చిన ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 గ్రూప్ 2 కేడర్ పోస్టులకు ఈనెల 26న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి ఆయా సెట్లలోని ప్రశ్నల వారీగా ‘కీ’లను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వీటిని కమిషన్ వెబ్‌సైట్లో పొందుపర్చినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు. ఈ కీ సంబంధించిన అభ్యంతరాలను మార్చి 7వ తేదీలోగా రాతపూర్వకంగా పంపించాలని పేర్కొన్నారు. ఫార్మాట్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్, వాట్సప్‌ల ద్వారా వచ్చే అభ్యంతరాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రశ్న ఐడీలు లేని అభ్యంతరాలు కూడా అనుమతించబోమన్నారు.
పోస్టల్ ఆలస్యానికి తమది బాధ్యత కాదని కార్యదర్శి పేర్కొన్నారు. గ్రూప్2లో వచ్చిన ప్రశ్నలు తమ టెస్టు సిరీస్‌లోనివేనని కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రచారం చేసుకుంటున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అభ్యర్ధులు వీటిని నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. సెట్ల వారీగా కాకుండా ప్రశ్నల వారీగా కీలను విడుదల చేయడంతో అభ్యర్థులు తొలుత ఒకింత గందరగోళానికి గురైనా తర్వాత అసలు సంగతి గుర్తించారు. కాగా, ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీలో అనేక తప్పులు దొర్లాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు.