గుంపుల గొడవలు, ఆధిపత్యపోరుతో సతమతమైనా, అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను సద్వినియోగం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరీ దయనీయంగా తయారై కనీసం ప్రజా సమస్యలపై స్పందించలేకపోయింది. వామపక్షాలు ప్రజా సమస్యలపై ఉద్యమాల బాట పట్టగా, టీఆర్‌ఎస్, బీజేపీ తదితర తెలంగాణవాద పార్టీలు ప్రత్యేక ఉద్యమానికి పరిమితమయ్యాయి. వైఎస్సార్‌సీపీ పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా ఉనికి చాటుకుంది. దాదాపు అన్ని పార్టీలు వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా బలోపేతం కావడం, ఇంటిని చక్కదిద్దుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాయి.. ఈ ఏడాది ఆయా పార్టీల పనితీరును ఓ సారి పరిశీలిస్తే...!!
- సాక్షిప్రతినిధి, నల్లగొండ
కాంగ్రెస్ : ఆధిపత్య పోరుతో సతమతం
అధికారిక పదవుల సంఖ్యను బట్టి చూస్తే జిల్లాలో ఇతర ఏపార్టీ లేనంత బలోపేతంగా కనిపించే అధికార కాంగ్రెస్ పార్టీ షరామామూలుగానే ఆధిపత్య పోరుతో సతమతమయ్యింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆత్మ విశ్వాసాన్ని ఆ పార్టీ ఈ ఏడాది సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా కూడగట్టుకుంది. ఈ రెండు ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది.
ఈ ఏడాది తొలి రోజునే హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రగ తి సంబరాల్లో ముగ్గురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఇక, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. పూర్తిగా తెలంగాణవాద మే వినిపించినా, ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమాల్లేవు. హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరిగిన తెలంగాణ సాధన సభకు జిల్లా నుంచి భారీ ఎత్తున తరలివెళ్లారు. కాగా, మరో వైపు కోమటిరెడ్డి సోదరులు, వారి వ్యతిరేక వర్గంగా కాంగ్రెస్ రెండు గుంపులుగా విడిపోయింది.
భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు జరిపారు. సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి, ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. మొత్తంగా జిల్లా కాంగ్రెస్ అంతా ఏకతాటిపై కనిపించిన సందర్భం ఈ ఏడాది సాంతంలో ఒక్కటీ లేకపోవడం విశేషం.
టీఆర్‌ఎస్ : సంస్థాగతంపై దృష్టి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుష్కర కాలం కిందట పురుడు పోసుకున్న టీఆర్‌ఎస్ ఒక వైపు తెలంగాణ ఉద్యమంతో మమేకమవుతూనే, రాజకీయ పార్టీగా నిలదొక్కునే ప్రయత్నం చేసింది. జేఏసీ, ఇతర తెలంగాణ వాద పార్టీలతోకలిసి ఉమ్మడిగా ఉద్యమించిన ఆ పార్టీ, అదే సమయంలో పార్టీ సంస్థాగత అంశాలపైనే దృష్టి నిలిపింది. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కల నెరవేరే దిశలో కేంద్రం ముందుకు కదులున్న నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో పార్టీని తెలంగాణలో అగ్ర భాగాన నిలిపే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓ విడత పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాలకు వెళ్లింది.
పార్టీ కేడర్‌లో అయోమయ్యాన్ని తొలగించి ఎన్నికలకు సిద్ధం చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహించింది. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పలువురు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 5వ తేదీన ఆ పార్టీ అధినేత కేసీఆర్ కోదాడలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డిని జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమించారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌లోనూ గ్రూపులలుకలుకలు పెరిగాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాల్లో ఈ ప్రభావం కనిపించింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ : ఒడిదుడుకులు
ఈ ఏడాది ప్రథమార్థంలో మంచి ఊపు మీద కనిపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయార్థానికి వచ్చే వరకు ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఫిబ్రవరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారు. ఐదు నియోజకవర్గాల గుండా సాగిన యాత్రకు విశేష స్పందన లభించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోదాడలో పాల్గొన్న పార్టీ సభకు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు అక్టోబరు 31వ తే దీన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించాల్సిన విజయమ్మను అధికార కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్డుకున్నారు. ఆ తర్వాత బ్రిజేష్ కమిటీ తీర్పు నిరసనగా విజయమ్మ పులిచింతల డ్యామ్‌పై దీక్ష చేశారు. సహకార, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ కొన్ని సీట్లు గెలుచుకుని ఉనికి చాటింది. హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆ ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగింది. ఇక, పార్టీ కన్వీనర్‌గా పనిచేసిన బీరవోలు సోమిరెడ్డిని కేంద్ర కార్యనిర్వాహక కమిటీ(సీఈసీ)లోకి తీసుకుని, గట్టు శ్రీకాంత్‌రెడ్డిని జిల్లా కన్వీనర్‌గా నియమించింది. నల్లగొండ, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు మినహా తొమ్మిది చోట్లా నియోజకవర్గ కోఆర్డినేటర్లను నియమించింది.
టీడీపీ : కుదేలు
ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఈ ఏడాది కూడా పూర్తిగా విఫలమైంది. ప్రజా సమస్యలపై కనీసం స్పందించకుండా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. తెలంగాణ రాష్ర్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ‘తమ్ముళ్లు’తలలు పట్టుకున్నారు. ఈ కారణంగానే రోడ్డు ఎక్కలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. జనవరి 17వ తేదీ నుంచి కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు చేపట్టిన ‘ మీకోసం’ పాదయాత్ర ఎవరి కోసమంటూ ఎవరూ పాల్గొనలేదు.
ఇటీవలి హై-లీన్ తుపాను బాధితులను పరామర్శించేందుకు బాబు నవంబర్ ఒకటో తేదీన జిల్లాలో పర్యటించినా పెద్దగా స్పందన రాలేదు. సహకార, గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీది చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి. పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా సరైన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఇక, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సరేసరి. ఇంకా, ఆలేరు, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను కూడా నియమించుకోలేని దుస్థితిలో పార్టీ ఉంది. ఈ ఏడాది టీడీపీకి గానీ, పార్టీ నేతలకు గానీ కలిసొచ్చిన అంశమూ పెద్దగా ఏమీ లేదు.
వామపక్షాలు :
ప్రజా ఉద్యమాల బాట
సీపీఎం : ప్రజా సమస్యల ఎజెండాతోనే ఈఏడాది సీపీఎం పనిచేసింది. వివిధ ఆందోళనలతో ప్రజల్లోకి వెళ్లింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు స్పందించిన సీపీఎం కలెక్టరేట్ ఎదుట పెద్ద సంఖ్యలోనే ధర్నాలు చేపట్టింది. ఆ పార్టీ అనుబంధ సంఘాలూ ఈ ఒరవడిని కొనసాగించాయి. సీపీఎం శాసనసభా పక్షనేత, మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీ దాకా యాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలపై జరిగిన కలెక్టరేట్ ధర్నాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి. రాఘవులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో తనకు పట్టున్న మండలాల్లో కొద్ది సంఖ్యలో పదవులను కైవసం చేసుకుంది.
సీపీఐ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో సాగిన ఉద్యమాల్లో సీపీఐ పాల్గొంది. వివిధ ప్రజా సమస్యలపై స్పందింస్తూనే.. మరోవైపు జేఏసీ, ఇతర తెలంగాణ ఉద్యమ పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాల్లో పాల్గొంది. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను తక్షణం చేపట్టాలనే డిమాండ్‌తో, నక్కలగండి నుంచి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల గుండా అసెంబ్లీ దాకా పాదయాత్ర చేపట్టింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నారాయణ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బీజేపీ : ఉనికి కోసం ఆరాటం
తెలంగాణ ఉద్యమ ఆందోళనల్లో పాల్గొనడం, పార్టీ పరంగా చిన్నాచితక కార్యక్రమాలు చేపట్టడం మినహా ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ పెద్దగా సాధించింది ఏమీ లేదు. పార్టీ ఉనికిని కాపాడుకునే దిశలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టింది. ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించాక, హైదరాబాద్‌లో జరిగిన మోడీ సదస్సుకు జిల్లా నుంచి సమీకరణ చేసింది. అంతకు ముందు పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు పాల్గొన జిల్లా కేంద్రంలో ఓ సదస్సు నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జిల్లాలో మూడు పర్యాయాలు పర్యటించారు. ఆలేరు, మునుగోడు నియోజవర్గాలు, జిల్లా కేంద్రంలో పార్టీ హడావిడి కనిపించింది. వివిధ సమీకరణల మధ్య వీరెల్లి చంద్రశేఖర్‌ను రెండోసారి అధ్యక్షునిగా నియమించారు. బీజేపీ నాయకుల మధ్యా చీలిక కనిపించింది.
ఎవరిగోలవారిది
Published Sat, Dec 28 2013 3:40 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement