గుణదల ఫ్లైవోవర్ పనులు ప్రారంభం | GUNADALA Fly overl to start work | Sakshi
Sakshi News home page

గుణదల ఫ్లైవోవర్ పనులు ప్రారంభం

Published Sat, Feb 28 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

GUNADALA Fly overl to start work

దగ్గరుండి పునఃప్రారంభం చేయించిన సీఆర్‌డీఏ సీఈ
ఆరు నెలల్లో పూర్తి చేయించేందుకు సన్నాహాలు
భూసేకరణకు ఇబ్బందులు తొలగించే యత్నం

 
విజయవాడ బ్యూరో : గుణదల ఫ్లైవోవర్ నిర్మాణ పనులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. సీఆర్‌డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు శుక్రవారం రామవరప్పాడు సెంటర్ సమీపంలో దగ్గరుండి పనులు మొదలు పెట్టించారు. ఈ ఫ్లైవోవర్ నిర్మాణంలో ఉండగా, 2013, డిసెంబర్‌లో ఒక గడ్డర్ కూలడంతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావడం ఆలస్యమవడం, వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ముందుకురాకపోవడంతో ఫ్లైవోవర్ నిర్మాణం అయోమయంగా మారింది.

ఈ ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్లే ఇన్నర్ రింగురోడ్డు పనులు పూర్తయినా దాన్ని ప్రారంభించే అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ ఏర్పడిన తర్వాత ఈ ఫ్లైవోవర్ నిర్మాణంపై దృష్టిపెట్టారు. సీఆర్‌డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు. రకరకాల కారణాలతో కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టకుండా జాప్యం చేస్తుండడంతో ఆయన మాట్లాడి నిర్మాణానికి ఒప్పించారు. శుక్రవారం ఒక శ్లాబ్ నిర్మాణ పనిని దగ్గరుండి ప్రారంభించేలా చూశారు.

అడ్డుగా ఉన్న ఇళ్ల తొలగింపునకు చర్యలు

ఫ్లైవోవర్ నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూసేకరణకు సైతం ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. రామవరప్పాడు సమీపంలోని రెండుచోట్ల ఫ్లైవోవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఇళ్లను తొలగిస్తేనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అక్కడి ఇళ్లను తొలగించాలంటే వాటిల్లో నివసిస్తున్న వారికి వేరేచోట ఇళ్లు ఇవ్వాలి. దీనిపై జిల్లా కలెక్టర్‌కు సీఆర్‌డీఏ లేఖ రాయనుంది. ఎంత త్వరగా ఆ ఇళ్లు తొలగిస్తే అంత వేగంగా పనులు నిర్వహిం చేందుకు అవకాశం ఉంది. ఇన్నోటెల్ హోటల్ వల్ల నిర్మాణానికి ఏమైనా ఇబ్బంది వస్తుందనే విషయంపైనా చర్చిస్తున్నారు.

ఐదేళ్లు ఆలస్యం..  

వీజీటీఎం ఉడా 2006 సంవత్సరంలో ఇన్నర్ రింగురోడ్డుకు ప్రణాళిక రూపొందించింది. రూ.74.24 కోట్లతో చేపట్టిన ఈ పనులకు 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండగా, అనేక అవాంతరాల కారణంగా పనులు సజావుగా జరగలేదు. గుణదల ఫ్లైవోవర్ గడ్డర్ కూలడంతో పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యయం రూ.119 కోట్లకు పెరిగినట్లు గత సంవత్సరం నిర్ధారించారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
ఆరు నెలల్లో పూర్తి చేయిస్తా : సీఈ

ఆరు నెలల్లో ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని సీఆర్‌డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు చెప్పారు. మొత్తం 21 శ్లాబులు వేయాల్సి ఉందని, నెలకు మూడు, నాలుగు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement