సిద్దిపేట: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు వాసిగా, సీమాంధ్ర బిడ్డగా దీక్షలు చేసినా, డ్యాన్స్‌లు చేసినా తమకు అభ్యంతరం లేదని, హైదరాబాద్ బిడ్డనని రాజధానికున్న బ్రాండ్ ఇమేజ్‌ను తన పిచ్చి చేష్టలతో డ్యామేజ్ చేయడం తగదని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కిరణ్ సీఎం పదవి హుందాతనాన్ని మంటగలుపుతూ, విలువలను నాశనం చేస్తూ అతితెలివి ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు.
బుధవారం తెలంగాణ మంత్రులను, ప్రజాప్రతినిధులను తోసుకుంటూ వెళ్లడమే కాకుండా వారిపై లాఠీచార్జి చేయించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆహంకారానికి ఇది నిదర్శనమన్నారు. సొంత పార్టీ మంత్రుల పట్ల అనుచితంగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డికి కలిసుండాలని కోరే హక్కు లేదన్నారు. ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం తెలంగాణలోని పది జిల్లాల్లో టీఆర్‌ఎస్ పక్షాన నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు తెలంగాణ అంతటా కొనసాగుతాయన్నారు.
మంత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సీఎం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో స్పీకర్‌గా ఉన్న కిరణ్‌ను మంచివాడు కాదని పక్షపాతి అని విమర్శించిన చంద్రబాబు నేడు కిరణ్‌ను నమ్ముతున్నాననడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ టీడీపీ ప్రజాప్రతినిధులు అనాధలుగా మిగిలి పోయారన్నారు. తెలంగాణకు తొలి ఒటుగా చెబుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావుది సీమాంధ్ర డీఎన్‌ఎగా అభివర్ణించారు.