హుకుంపేటలో వర్షం కురుస్తున్న దృశ్యం
అరకులోయ: మన్యంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో సుమారు 3 గంటల పాటు భారీ వర్షం కురవడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కుండపోత వానతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతగిరి–అరకు ఘాట్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వాహనచోదకులు, ప్రయాణికులను భయపెట్టింది. అరకులోయ పట్టణంలో కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా పర్యాటక ప్రాంతాలన్నీ బోసిపోయాయి. అరకు సంత నుంచి జైపూర్ పోయే రోడ్డులో కిల్లోగుడ వరకు ఉన్న చిన్న కల్వర్టుల మీదుగా వర్షం నీరు పొంగి ప్రవహించింది. అరకులోయ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో పంటపొలాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. కొత్తభల్లుగుడ, సుంకరమెట్ట, బస్కి, మాడగడ, చొంపి, సిరగం, చినలబుడు పంచాయతీల పరిధిలోని పంట భూముల్లో వరదనీరు భారీగా ప్రవహించింది. హుకుంపేట మండలంలోని రంగశీల, కొట్నాపల్లి, మఠం ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రాళ్లగెడ్డ, దిగుడుపుట్టు, మత్స్యగెడ్డలలో నీటి ప్రవాహం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment